IND vs AUS: నాగ్‌పుర్‌ ప్రజల కోసం ఆడాలని బలంగా భావించాం: డీకే

గత మూడు రోజలుగా నాగ్‌పుర్‌లో వర్షం పడటంతో విదర్భ మైదానం చిత్తడిగా మారిపోయింది. అయితేనేం మ్యాచ్‌ నిర్వహణకు గ్రౌండ్ సిబ్బంది ప్రతిక్షణం కష్టపడ్డారు. ఆఖరికిజజ

Published : 24 Sep 2022 14:57 IST

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: గత మూడు రోజలుగా నాగ్‌పుర్‌లో వర్షం పడటంతో విదర్భ మైదానం చిత్తడిగా మారిపోయింది. అయితేనేం మ్యాచ్‌ నిర్వహణకు గ్రౌండ్ సిబ్బంది ప్రతిక్షణం కష్టపడ్డారు. ఆఖరికి రెండున్నర గంటలు ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. ఇక మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు వేచి ఉండి మరీ ఉత్కంఠభరితంగా సాగిన పోరును వీక్షించారు. మ్యాచ్‌ అనంతరం దినేశ్‌ కార్తిక్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా ఇదే చెప్పాడు. నాగ్‌పుర్‌ సిటీ ప్రజల కోసం భారత్, ఆసీస్‌ జట్లు మ్యాచ్‌ను ఆడాలని బలంగా కోరుకున్నాయని చెప్పాడు. అలాగే గ్రౌండ్‌ను సిద్ధం చేసిన సిబ్బందిని అభినందిస్తూ టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ప్రత్యేకంగా ట్వీట్‌ చేశాడు. ‘మ్యాచ్‌ జరిగేందుకు కష్టపడిన గ్రౌండ్‌ సిబ్బందికి ధన్యవాదాలు’ అని పోస్టు చేశాడు.

(ఫొటో సోర్స్‌: హార్దిక్‌ ట్విటర్)

సాధారణంగా రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా.. మైదానం చిత్తడిగా మారడంతో దాదాపు రెండున్నర గంటల తర్వాత ఎనిమిది ఓవర్లకు కుదిస్తూ మ్యాచ్‌ జరిగింది. ‘‘ఎలాగైనా మ్యాచ్‌ ఆడాలని మేమంతా బలంగా కోరుకున్నాం. కారణం ఒకటే.. మేం హోటల్‌ గది నుంచి స్టేడియం చేరుకొనే వరకు దారి పొడవునా భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. మైదానానికి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పట్టింది. కొవిడ్‌ తర్వాత జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఇదొక ప్రత్యేక సందర్భం. అందుకే నాగ్‌పుర్‌ సిటీ ప్రజల కోసమే మ్యాచ్‌ ఆడాలని ఇరు జట్ల సభ్యులం కోరుకున్నాం. అవుట్ ఫీల్డ్‌ అద్భుతంగా లేకపోయినా ఫర్వాలేదు’’ అని కార్తిక్‌ వివరించాడు. చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు అవసరమైన క్రమంలో కార్తిక్‌ (10*) సిక్స్‌, ఫోర్‌ కొట్టేసి భారత్‌ను గెలిపించాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని