Published : 22 Apr 2022 01:23 IST

Suresh Raina: రైనా దేవుడిలా నా జీవితంలోకి వచ్చాడు: కార్తీక్‌ త్యాగి

(Photos: Suresh Raina, Kartik Tyagi Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై మాజీ ప్లేయర్‌ సురేశ్‌ రైనా దేవుడిలా తన జీవితంలోకి వచ్చాడని హైదరాబాద్‌ యువ పేసర్‌ కార్తీక్‌ త్యాగీ అన్నాడు. 2020 అండర్‌-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి వచ్చిన ఈ ఉత్తర్‌ ప్రదేశ్‌ కుర్రాడు అదే ఏడాది టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే ఆరంభ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి ఆకట్టుకున్న అతడు గతేడాది 4 మ్యాచ్‌లే ఆడి 4 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి మెగా వేలంలో హైదరాబాద్‌ టీమ్‌ రూ.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో రెండేళ్లలోనే అతడి జీవితం మారిపోయింది. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన కార్తీక్‌.. మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనానే తన ఎదుగుదలకు కారణమని చెప్పాడు.

‘నేనెప్పుడూ ఒకే విషయం చెప్తా. రైనా నా జీవితంలోకి దేవుడిలా వచ్చాడు. అండర్‌-16 స్థాయిలో రంజీ జట్టుకు ఎంపికయ్యాకే నన్ను ప్రజలు గుర్తుపట్టడం మొదలెట్టారు. నేను 13 ఏళ్లు ఉండగా అండర్-14 స్థాయిలో క్రికెట్‌ ఆడటం ప్రారంభించా. అక్కడే నా కెరీర్‌ మొదలైంది. తర్వాత అండర్‌-16లో ఒక సీజన్‌లో  ఏడు మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాను. దాంతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాను. అప్పుడు నేను అద్భుతంగా రాణించినా ఫైనల్స్‌లో మేం గెలవలేకపోయాం. కానీ, అప్పుడే కోచ్‌ జ్ఞానేంద్ర పాండే నా బౌలింగ్‌ను మెచ్చుకొని ఇకపై నన్ను ప్రోత్సహిస్తానని చెప్పారు. అక్కడి నుంచి రాష్ట్ర రంజీ జట్టుకు ఎంపికయ్యా. ఆ జట్టులో చేరినప్పుడు నా వయసు 16 ఏళ్లే. మిగతావాళ్లంతా ఎప్పటినుంచో ఆడుతున్నారు. అదే సమయంలో ఒకసారి రైనాతో పరిచయం అయింది’ అని చెప్పుకొచ్చాడు.

‘రంజీ జట్టులో నేను చాలా సైలెంట్‌గా ఉంటూ అన్ని విషయాలూ గమనించేవాడిని. ఒకసారి మేం ప్రాక్టీస్ చేసేటప్పుడు అక్కడికి రైనా వచ్చాడు. అతను వెళ్లేముందు నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. నువ్వేం చేస్తావని అడిగితే బౌలర్‌ అని చెప్పా. దాంతో నన్ను నెట్స్‌లో తనకు బౌలింగ్‌ చేయమని కోరాడు. నా బౌలింగ్‌కు మెచ్చిన రైనా.. భవిష్యత్‌లో నాకు మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. అంత గొప్ప ఆటగాడు నా బౌలింగ్‌ను మెచ్చుకోవడంతో తొలుత నేను నమ్మలేకపోయా. జోక్‌ చేస్తున్నాడనుకున్నా. తర్వాత నా పేరు సీనియర్‌ రంజీ టీమ్‌కు ఎంపికయ్యాక షాకయ్యా. అక్కడి నుంచే నా రంజీ కెరీర్‌ మొదలైంది. అక్కడ రాణించి అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యా’ అని కార్తీక్‌ వివరించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని