KBC: నా హాకీ ప్యాడ్స్‌ కోసం ఆవును అమ్మేశారు: హాకీ గోల్‌కీపర్‌ శ్రీజేష్‌

ప్రతిష్ఠాత్మక క్విజ్‌షో, అమితాబ్‌ బచ్చన్ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ సీజన్‌-13లో ఇటీవల టోక్యో ఒలింపిక్‌ విజేతలు నీరజ్‌ చోప్రా, పీఆర్‌ శిరీష్‌ పాల్గొన్నారు. సాధారణ క్విజ్‌షోలా ప్రశ్నలు జవాబులు అడగకుండా వారి జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాల, కష్టసుఖాల గురించి చెప్పమనగానే.. హాకీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్ భావోద్వేగానికి లోనై.. ‘‘నేను జీవీ రాజా స్పోర్ట్స్‌ స్కూల్‌కి ఎంపికైనప్పుడు..

Published : 18 Sep 2021 01:09 IST

ముంబయి: ప్రతిష్టాత్మక క్విజ్‌షో, అమితాబ్‌ బచ్చన్ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ సీజన్‌-13లో ఇటీవల టోక్యో ఒలింపిక్‌ విజేతలు నీరజ్‌ చోప్రా, పీఆర్‌ శిరీష్‌ పాల్గొన్నారు. సాధారణ క్విజ్‌షోలా ప్రశ్నలు జవాబులు అడగకుండా వారి జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాల, కష్టసుఖాల గురించి చెప్పమన్నారు. దీనికి హాకీ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్ భావోద్వేగానికిలోనై తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకున్నారు.

‘‘నేను జీవీ రాజా స్పోర్ట్స్‌ స్కూల్‌కి ఎంపికైనప్పుడు.. ‘నువ్వు క్రీడలవైపు వెళ్లాలనుకుంటున్నావ్‌? నీకు అక్కడ స్థిరమైన ఉద్యోగం దొరుకుతుందా?’ అని నాన్న ప్రశ్నించారు. ‘నేనేంటో నిరూపించుకోవడానికి మూడేళ్ల సమయం ఇవ్వండి నాన్న. ఈలోపు నేను కనుక ఫెయిల్‌ అయితే మళ్లీ నా రూట్‌ మార్చుకుంటా’ అని మాటిచ్చా. ఆ ఒప్పందంతో నేను హాకీ ఆడటం మొదలుపెట్టా. అలా గోల్‌కీపర్‌గా రంగప్రవేశం చేశా. 

గోల్‌కీపింగ్‌ గురించి మీకో విషయం చెప్పాలి. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత వెచ్చించే డబ్బు మా దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే మాదో సాధారణ రైతు కుటుంబం. హాకీ పాడ్స్‌ కొనేంత ఆర్థిక పరిస్థితి లేదు. ఓ రోజు మా నాన్నను ప్యాడ్స్‌ కోసం డబ్బులు కావాలని అడిగా. ఆయన శక్తి మేరకు ఎలాగైనా పంపించేలా ప్రయత్నం చేశారు. అలా ఆయన అన్నట్టే ప్యాడ్స్‌ కొనిచ్చారు. నాన్న ఎలా కొనిచ్చారని అమ్మను అడగగానే కేవలం నా పాడ్స్‌ కోసమని నాన్న మా కుటుంబానికి జీవనాధారణమైన ఆవును అమ్మేశారని తెలిసింది’’ అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. 

‘‘నేను ఎప్పుడైనా నిరుత్సాహానికి గురైనప్పుడు లేదా ఈ క్రీడలెందుకు వదిలేద్దామా అని ఆలోచనవచ్చినప్పుడు ఆరోజు మా నాన్న నాకోసం చేసిన త్యాగాన్ని గుర్తుతెచ్చుకుంటా. తన బిడ్డ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాడని ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని, అలాగే జీవనాధారమైన ఆవుని అమ్మేసి నాకోసం చేసిన రిస్క్‌ని గుర్తుచేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ జట్టు  కాంస్యం సాధించడంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేష్‌.. కాంస్యం పతకాన్ని తన తండ్రికి అంకితమించినట్లు పేర్కొన్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని