Rohit Sharma: తన కెప్టెన్సీ విజయ రహస్యం చెప్పిన రోహిత్‌ శర్మ

భారత టీ20 లీగ్‌లో ముంబయి జట్టును విజయవంతంగా నడిపించాడు రోహిత్‌ శర్మ. ఆ జట్టు ఏకంగా ఐదు టైటిళ్లతో టాప్‌లో ఉంది. దీంతో రోహిత్‌ నాయకత్వంపై మాజీలు, క్రికెట్‌ పండితులు........

Updated : 20 Aug 2022 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత టీ20 లీగ్‌లో ముంబయి జట్టును విజయవంతంగా నడిపించాడు రోహిత్‌ శర్మ. ఆ జట్టు ఏకంగా ఐదు టైటిళ్లతో టాప్‌లో ఉంది. దీంతో రోహిత్‌ నాయకత్వంపై మాజీలు, క్రికెట్‌ పండితులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా, టీమ్‌ఇండియా అన్ని ఫార్మాట్లకు ఇప్పుడు రోహిత్‌ సారథ్యం వహిస్తూ.. జట్లను ముందుండి నడిపిస్తూ విజయ తీరాలకు చేరుస్తున్నాడు. కాగా తన కెప్టెన్సీ శైలి గురించి హిట్‌మ్యాన్‌ మాట్లాడాడు. పరిస్థితులను క్లిష్టంగా చూడబోనని, విషయాలను చాలా సరళంగా ఉంచేందుకే ప్రయత్నిస్తానని.. అదే తన కెప్టెన్సీ విజయ రహస్యమని చెప్పుకొచ్చాడు.

ఓ క్రీడా ఛానెల్‌లో ‘ఫాలో ది బ్ల్యూస్‌’ అనే కార్యక్రమంలో రోహిత్‌ తన నాయకత్వం గురించి మాట్లాడాడు. ‘విషయాలను చాలా తేలిగ్గా, సరళంగా ఉంచుతాను. వాటిని క్లిష్టతరం చేయను. ముంబయిని నడిపిస్తూ ఇదే చేశాను. ఇప్పుడు టీమ్‌ఇండియాలోనూ ఆ సూత్రాన్నే కొనసాగిస్తున్నా. జట్టు సభ్యులకు పూర్తి స్వేచ్ఛనిస్తా. టీమ్‌లో ఎవరి  బాధ్యతలను వారికి అర్థమయ్యేలా చెప్పి, వారి నుంచి జట్టు ఏం ఆశిస్తుందో వారికి క్లియర్‌గా తెలియజేస్తా. ఈ విషయంలో నేను, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాలను చాలా సులభంగా, సరళంగా తెలియజేస్తా’ అని పేర్కొన్నాడు.

తన నాయకత్వం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుతూ.. ఏ ఆటగాడైనా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు అసలు సమస్య ఏంటో అతడికి స్పష్టంగా తెలిజేస్తానని చెప్పాడు. తిరిగి ఫాం అందుకోవాలంటే అతడు ఏ అంశంపై దృష్టి పెట్టాలలో సైతం క్లియర్‌గా తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. ‘పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి బలాలు బలహీనతలు చెప్పి.. ఒక్కో ప్లేయర్‌ నుంచి టీం ఏం ఆశిస్తుందో తెలియజేయాలి. దానిపై దృష్టిసారించేలా ప్రోత్సహించాలి. అలాంటి సమయంలోనే ఆటగాడు వ్యక్తిగతంగా రాణించగలడు. కెప్టెన్‌గా నేను దీనిపై ఎక్కవగా దృష్టిపెడతా’ అని రోహిత్‌ వెల్లడించాడు.

అది కూడా మామూలు మ్యాచే

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. ఈ క్రమంలో దాయాది పోరును ఎలా చూస్తారనే దానికి రోహిత్ శర్మ స్పందించాడు. ‘‘పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే అందరిలోనూ ఉత్సాహం ఉంటుంది. ఒత్తిడి కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎంత నియంత్రించుకున్నా అదుపు చేయలేం. అందుకే ఇలాంటి మ్యాచ్‌ల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటాం. ఇతర టీమ్‌లతో ఆడినట్లే పాక్‌తోనూ ఆడతాం. మేం కేవలం ఆట మీదనే దృష్టిపెడతాం’’ అని వివరించాడు. ఆసియా కప్‌లో భారత్-పాక్‌ ఆగస్ట్‌ 28న ఢీకొంటాయి. అయితే పాక్‌ పేసర్‌ షహీన్‌ అఫ్రిదీ గాయం కారణంగా ఆసియా కప్‌ నుంచి వైదొలిగినట్లు ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని