Team India: అందుకే భయమేసిందన్న పీటర్సన్‌!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సన్నాహంలో టీమ్‌ఇండియా వెనకబడిందేమోనని భయమేస్తోందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. ముందుగానే రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్‌కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నాడు. ఫైనల్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.....

Published : 19 Jun 2021 01:12 IST

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సన్నాహకంలో టీమ్‌ఇండియా వెనకబడిందేమోనని భయమేస్తోందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. ముందుగానే రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్‌కు ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నాడు. ఫైనల్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమయ్యేందుకు న్యూజిలాండ్‌కు మంచి అవకాశాలు దొరికాయి. వారు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడారు. నిజం చెప్పాలంటే వారు ఆంగ్లేయులను చిత్తుచేశారు. వాయిదా పడ్డ ఐపీఎల్‌లో భాగమై, సరైన వార్మప్‌ మ్యాచులు ఆడకుండా ఇంగ్లాండ్‌లో టెస్టులకు సన్నద్ధం కాలేరు. రూట్‌ సేనపై కివీస్‌ పేస్‌ బౌలింగ్‌ అద్భుతంగా అనిపించింది. లార్డ్స్‌లో టిమ్‌సౌథీ రెచ్చిపోయాడు. రెండో టెస్టులో మ్యాట్‌ హెన్రీ దుమ్మురేపాడు. అతడు ఫైనల్‌ ఆడటం లేదు. ఒకే టెస్టు మ్యాచ్‌ ఉంటే అందరికీ అవకాశాలు దక్కవు. టీమ్‌ఇండియా ఎలాంటి వార్మప్‌ మ్యాచ్‌ ఆడలేదు. వారికి సరైన సన్నాహకం లభించలేదని నాకు భయమేసింది’ అని పీటర్సన్‌ అన్నాడు.

ఐసీసీ తొలి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యమైంది. నిరంతరాయంగా వర్షం కురియడంతో తొలిరోజు తొలి సెషన్‌ ఆట కుదరదని తెలిసింది. బీసీసీఐ ఈ మేరకు ట్వీట్‌ చేసింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో అభిమానులు నిరాశపడుతున్నారు. శుక్రవారం పూర్తిగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. మరి తొలిరోజు ఆట జరుగుతుందా లేదా చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని