WTC Final: కీలక మ్యాచ్‌లు మా దగ్గరొద్దు: పీటర్సన్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లాంటి కీలకమైన మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌లో నిర్వహించరాదని ఆ జట్టు మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌...

Published : 22 Jun 2021 01:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లాంటి కీలకమైన మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌లో నిర్వహించరాదని ఆ జట్టు మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా ఏజీస్‌బౌల్‌ మైదానంలో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తొలిరోజు మాదిరే సోమవారం కూడా నాలుగో రోజు వర్షం కారణంగా ఒక్క బంతీ పడకముందే మ్యాచ్‌ నిలిచిపోయింది. ఈ క్రమంలోనే రెండు ట్వీట్లు చేసిన పీటర్సన్‌ ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశాడు.

‘ఇది చెప్పడానికి నాకు బాధగా ఉన్నా.. ఇలాంటి అత్యంత కీలకమైన మ్యాచ్‌లను ఇంగ్లాండ్‌లో నిర్వహించకూడదు. నా అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లాంటి కీలక మ్యాచ్‌లను ఎప్పుడూ దుబాయ్‌లో నిర్వహించాలి. అది తటస్థ వేదిక. అత్యద్భుతమైన స్టేడియం. కచ్చితమైన వాతావరణ పరిస్థితులు తెలుస్తాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేసుకునేందుకు తగిన వసతులు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యం కలిగిన ప్రదేశం. అన్నిటికీ మించి ఐసీసీ కార్యాలయం కూడా స్టేడియం పక్కనే ఉంది’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు. మరోవైపు నాలుగో రోజు ఆట రద్దవ్వడం పట్ల టీమ్‌ఇండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం పెదవి విరిచాడు. అటు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ టైమింగ్‌.. ఇటు ఐసీసీ టైమింగ్‌.. రెండూ సరిగా లేవని తనదైనశైలిలో ట్వీట్‌ చేస్తూ చమత్కరించాడు. ఇంగ్లాండ్‌లోని వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలిసి కూడా ఐసీసీ అక్కడ ఫైనల్‌ను నిర్వహించడంపై అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని