Kevin Pietersen: ఆసీస్‌ మిచెల్‌ను వాడుకున్నట్లే.. టీమ్‌ఇండియా కూడా.. : పీటర్సన్

ఆస్ట్రేలియా టీమ్‌ మిచెల్‌ జాన్సన్‌ను ఉపయోగించుకున్నట్లు టీమ్‌ఇండియా ఉమ్రాన్‌ మాలిక్‌ను ఉపయోగించుకోవాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ సూచించాడు...

Published : 08 May 2022 02:27 IST

(Photos: Kevin Pietersen, Umran Malik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా టీమ్‌ మిచెల్‌ జాన్సన్‌ను ఉపయోగించుకున్నట్లు టీమ్‌ఇండియా ఉమ్రాన్‌ మాలిక్‌ను ఉపయోగించుకోవాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ సూచించాడు. అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవడంలో ఆలస్యం చేయొద్దని కోరాడు. రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటనలో ఈ జమ్మూకశ్మీర్‌ పేస్‌ సెన్సేషన్‌ను ఎంపిక చేయాలన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న భారత టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ పేసర్‌గా కొనసాగుతున్న ఉమ్రాన్‌ చాలా నిలకడగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ముఖ్యంగా 150కిమీ వేగానికి పైగా బంతులు సంధిస్తూ అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పీటర్సన్‌ సైతం ఉమ్రాన్‌ బౌలింగ్‌పై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘ప్రస్తుతం జరుగుతోన్న మెగా టీ20 టోర్నీలో భారత యువ పేసర్లు చాలా మంది రాణిస్తున్నారు. విదేశీయుల్లో లాకీ ఫెర్గూసన్‌, అల్‌జారీ జోసెఫ్‌ మాత్రమే మెరుస్తున్నారు. కార్తీక్‌ త్యాగీ, మోహ్‌సిన్‌ ఖాన్‌ ఫర్వాలేదు. కానీ, బాగా ఆకట్టుకున్న బౌలర్‌ మాత్రం ఉమ్రాన్‌ మాలిక్‌. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతడు 157 కిమీ వేగంతో బౌలింగ్‌ చేశాడు. అదెంతో ప్రమాదకరమైన పేస్‌. ఆసీస్‌ జాన్సన్‌ను వాడుకున్నట్లు టీమ్‌ఇండియా అతడిని ఉపయోగించుకోవాలి. ఒకవేళ నేనే టీమ్‌ఇండియా సెలెక్టర్‌ అయితే, రాబోయే ఇంగ్లాండ్‌ పర్యటనలో ఆడే టెస్టు మ్యాచ్‌కు ఉమ్రాన్‌ను ఎంపిక చేస్తా’ అని పీటర్సన్‌ పేర్కొన్నాడు. మరోవైపు ఈ సారి రాజస్థాన్‌ ప్లేఆఫ్స్ చేరి అక్కడి నుంచి టైటిల్‌ సాధిస్తే.. తమ మాజీ సారథి, మెంటార్‌ షేన్‌వార్న్‌కు ఘన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు