Kevin Pietersen: నోబాల్‌ వివాదం.. పంత్‌, ఆమ్రే తీరుపై పీటర్సన్‌ ఫైర్‌

దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, ఆ జట్టు సహాయక కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె తీరుపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు మీరేం అనుకుంటున్నారని చిందులు తొక్కాడు...

Updated : 23 Apr 2022 10:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, ఆ జట్టు సహాయక కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె తీరుపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు మీరేం అనుకుంటున్నారని చిందులు తొక్కాడు. గతరాత్రి రాజస్థాన్‌ నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీకి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో రోమన్‌ పావెల్‌ (36; 15 బంతుల్లో 5x6) తొలి 3 బంతుల్ని 3 సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చేశాడు. అయితే, మూడో బంతి అతడి నడుముపైకి రావడంతో అది నోబాల్‌లా కనిపించింది. దీనిపై పావెల్‌ ఫీల్డ్‌ అంపైర్లను నిర్ధారించుకోవాలని అడిగినా వాళ్లు థర్డ్‌ అంపైర్‌కు నివేదించలేదు. దీంతో కాసేపు మైదానంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అందుకు నిరసనగా దిల్లీ కెప్టెన్‌ పంత్‌.. తమ బ్యాట్స్‌మెన్‌ను మైదానం వీడి బయటకు రావాలని పిలిచాడు. వెంటనే సహాయ కోచ్‌ ఆమ్రె కలగజేసుకొని మైదానంలోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో మ్యాచ్‌ జరిగింది. చివరికి దిల్లీ 207/8తో నిలిచి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే పంత్‌, ఆమ్రె తీరును పీటర్సన్‌ తప్పుబట్టాడు. ఆటలో అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయని, అంతమాత్రానా ఇలా స్పందించడం తగదని అన్నాడు. దిల్లీ జట్టు ఇలా చేయడం క్రికెట్‌కు మంచిది కాదన్నాడు.

‘అది నోబాల్‌ ఇవ్వకపోవడంతో పంత్‌ కాస్త ఇబ్బందిగానే ఫీల్‌ అయి ఉండొచ్చు. కానీ, అంపైర్ల తీరు కన్నా.. నాకు దిల్లీ జట్టు వ్యవహరించిన తీరే ఆశ్చర్యం కలిగించింది. రికీ పాంటింగ్‌ ఉంటే ఇలా జరిగేది కాదని అనుకుంటున్నా. ఆ సమయంలో బట్లర్‌.. పంత్‌తో మాట్లాడటం తప్పుకాదు. సహాయక కోచ్‌ను మైదానంలోకి పంపి ఏం చేద్దామనుకుంటున్నావ్‌? అది సరైన పద్ధతేనా?క్రికెట్ అనేది జెంటిల్‌మెన్‌ గేమ్‌. ఎవరైనా పొరపాట్లు చేస్తారు. క్రికెట్‌లో ఎన్నిసార్లు ఇలా జరగలేదు. ఔట్లు నాటౌట్లుగా, నాటౌట్లు ఔట్లుగా ఇంతకుముందు ఇవ్వలేదా? వాళ్ల గురించి వాళ్లేం అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ, ఇలా చేయడం మంచిదికాదు. ఆమ్రెను అలా మైదానంలోకి పంపడమే పెద్ద తప్పు. అతడిలాంటి పెద్ద మనిషి అలా వెళ్లి అంపైర్లతో మాట్లాడటం ఏంటో నాకర్థం కాలేదు. ఇది అస్సలు సహించరానిది. ఇలాంటివి మళ్లీ క్రికెట్‌లో నేను చూడాలనుకోట్లేదు’ అని పీటర్సన్‌ మండిపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు