T20 League : 10 జట్లు.. 2 గ్రూప్‌లు.. 14 మ్యాచ్‌లు.. లెక్క ఇదీ!

ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న 15వ సీజన్‌...

Updated : 26 Mar 2022 15:23 IST

గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు

ఇంటర్నెట్ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న దేశవాళీ టీ20 లీగ్‌ వివరాలు వచ్చేశాయి. కొవిడ్ నేపథ్యంలో విమాన ప్రయాణాల్ని నివారించేలా రెండు నగరాల్లోని నాలుగు మైదానాల్లోనే జరుగుతాయని వెల్లడించింది. ఈ మేరకు నిన్న జరిగిన గవర్నింగ్‌ కౌన్సిల్ సమావేశ వివరాలను ప్రకటించింది. మార్చి 26న ప్రారంభమవుతుంది. మే 29వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్‌ల తేదీలు, ఎప్పుడు ఎక్కడ జరుగుతాయనే వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మొత్తం ఎన్ని మ్యాచ్‌లు..?

ఈసారి పది జట్లు తలపడబోయే టోర్నీలో 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి. ఛాంపియన్‌షిప్‌ను ఏ జట్టు ఎన్నిసార్లు గెలుచుకుంది, ఏ జట్టు ఎన్నిసార్లు ఫైనల్‌కు చేరుకుందనే వివరాలను దృష్టిలో పెట్టుకుని పది జట్లను రెండు వర్చువల్‌ గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి జట్టూ 14 లీగ్‌ మ్యాచ్‌లను ఆడాలి. ఏడు సొంత మైదానంలో, మరో ఏడు బయట స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి జట్టు నాలుగేసి మ్యాచ్‌లను వాంఖడే, డీవై పాటిల్‌ మైదానాల్లోనూ.. మూడేసి మ్యాచ్‌లను సీసీఐ (ముంబయి), ఎంసీఏ అంతర్జాతీయ స్టేడియాల్లో (పుణె) ఆడాలి. వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు, సీసీఐ మైదానంలో 15, డీవై పాటిల్‌ స్టేడియంలో 20, పుణె ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో జట్టుకు సొంతమైదానం ఏదనేది నిర్ణయించాల్సి ఉంది.

ఏ జట్టు ఏ గ్రూప్‌లో...?

పది జట్లను వాటి ప్రదర్శన ఆధారంగా రెండు గ్రూప్‌లుగా విభజించింది. గ్రూప్‌-Aలో ముంబయి, కోల్‌కతా, రాజస్థాన్‌, దిల్లీ, లఖ్‌నవూ ఉన్నాయి. ఇక గ్రూప్‌-Bలో చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, పంజాబ్‌, గుజరాత్‌ జట్లకు స్థానం దక్కింది. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని టీమ్‌తో రెండేసి మ్యాచ్‌లను ఆడాలి. ఇక రెండో గ్రూప్‌లోని ఓ జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగతా టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంటుంది.

* ఉదాహరణకు.. హైదరాబాద్‌ను తీసుకుంటే.. ఈ జట్టు గ్రూప్‌-బిలో ఉంది. ఇక్కడ ఉన్న చెన్నై, బెంగళూరు, పంజాబ్‌, గుజరాత్‌తో రెండేసి మ్యాచ్‌లను ఆడుతుంది. గ్రూప్‌-ఏలోని కోల్‌కతాతో రెండు మ్యాచ్‌లు.. ముంబయి, రాజస్థాన్‌, దిల్లీ, లఖ్‌నవూతో ఒక్కో మ్యాచ్‌ను ఆడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు