IND vs PAK : టాప్‌ ఆర్డర్‌ అదిరే ఆరంభం.. శతకాల మోత.. కుల్‌దీప్‌ మాయ

దాయాది(IND vs PAK)పై భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. అన్ని విభాగాల్లో రాణిస్తూ సత్తా చాటింది.

Updated : 12 Sep 2023 12:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  పాక్‌ పేస్‌ దాడిని తట్టుకొని ఆడగలరా..? అన్నారు.. జట్టు కూర్పు సరిగ్గా లేదు.. ప్రపంచకప్‌ ముందు ఇలాంటి జట్టా..? అని విమర్శించారు. అయితే.. వాటన్నింటికీ సమాధానం చెబుతూ టీమ్‌ ఇండియా(Team India).. ఆసియా కప్‌(Asia Cup 2023) సూపర్‌ 4 మ్యాచ్‌లో చిరికాల ప్రత్యర్థి(IND vs PAK)పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇటు బ్యాటింగ్‌.. అటూ బౌలింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వర్షం కారణంగా రెండు రోజులపాటు సాగిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన తనను తాను పరీక్షించుకుంటూ.. వన్డేల్లో నం.2 జట్టైన పాక్‌ను చిత్తు చేసింది. ఆ జట్టుకు అసలు పోరాడేందుకు ఏ దశలోనూ అవకాశమే ఇవ్వలేదు.

ఇక దాయాదిపై టీమ్‌ఇండియా చిరస్మరణీయ విజయంలో కీలకాంశాలుగా నిలిచినవి ఇవే..

టాప్‌ ఆర్డర్‌ అదిరే ఆరంభం : పాక్‌తో లీగ్‌ మ్యాచ్‌లో భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్ల ప్రదర్శన అంతంత మాత్రమే. అయితే.. సూపర్‌ -4 మ్యాచ్‌లో మాత్రం దాయాది పేస్‌ దాడిని సమర్థంగా ఎదుర్కొని ఓపెనర్లు రోహిత్‌, గిల్‌ అర్ధ శతకాలతో అదిరే ఆరంభాన్ని ఇవ్వగా.. ఆ తర్వాత విరాట్‌, కేఎల్‌ రాహుల్‌ శతకాలతో విరుచుకుపడ్డారు. ప్రపంచకప్‌ ముందు ఇలా టాప్‌ ఆర్డర్‌ రాణించడం శుభ సూచికం. టీమ్‌ ఇండియా తన ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే.. వచ్చే మ్యాచ్‌ల్లో ఎదురుండదు.

సచిన్‌ రికార్డులపై గురి.. దూసుకెళ్తున్న కోహ్లీ

కేఎల్‌ గొప్ప పునరాగమనం : గాయం తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ ఎంపికపై వచ్చిన ప్రశ్నలకు తన ఇన్నింగ్సే సమాధానం. నంబర్‌ 4 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. శతకంతో తన పునరాగమనాన్ని గొప్పగా చాటి చెప్పాడు. మరోవైపు కింగ్‌ కోహ్లీతో అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేసి.. జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చి అటు బ్యాట్‌తో పాటు.. ఇటు కీపింగ్‌లోనూ రాణించి తన ఫామ్‌, ఫిట్‌నెస్‌పై ఏ సందేహాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు.

కుల్‌దీప్‌ మాయ : ఇక పాక్‌ బ్యాటింగ్‌ వెన్ను విరిచిన చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడి మాయ ముందు పాక్‌ బ్యాటర్లు నిలవలేకపోయారు. బంతి ఎక్కడ పడుతుందో, ఎటు తిరుగుతుందో తెలియనట్లుగా సాగిన అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్‌ బ్యాటర్లకు శక్తికి మించిన పనే అయింది. వరుసగా  8 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కుల్‌దీప్‌.. మరో బౌలర్‌కు అవకాశమివ్వకుండా చివరి 5 వికెట్లనూ తన ఖాతాలోనే వేసుకున్నాడు. పాక్‌ను స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

విరాట్‌ కోహ్లీ అద్భుత ఫామ్‌ : పాకిస్థాన్‌ అంటే చెలరేగి ఆడే విరాట్‌ కోహ్లీ.. మరోసారి సూపర్‌ 4 మ్యాచ్‌లో సత్తా చాటాడు. అద్భుత శతకంతో అజేయంగా నిలిచి పాక్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. వన్డే ప్రపంచకప్‌ ముందు విరాట్‌ అద్భుత ఫామ్‌.. జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోసారి తన సత్తా చాటి.. తన ఇన్నింగ్స్‌తో తిరుగులేదని నిరూపించుకున్నాడు.

మిడిలార్డర్‌ కుదరుకున్నట్టేనా.. : కేఎల్‌ రాహుల్‌ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుత శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో నలుగురికే బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చింది. లీగ్‌ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య రాణించిన విషయం తెలిసిందే. దీంతో టాప్‌ ఆర్డర్‌తోపాటు మిడిలార్డర్‌ సమస్యలకు చెక్‌ పెట్టినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక సూపర్‌ 4 తొలి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన టీమ్‌ ఇండియా.. ఇదే ఆటతీరును తర్వాతి మ్యాచ్‌ల్లో కొనసాగించి అద్భుత విజయాలను నమోదు చేయాలని అభిమానులు కోరుతున్నారు. నేడు రోహిత్‌ సేన శ్రీలంకతో తలపడనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని