Kidambi Srikanth: కిదాంబి శ్రీకాంత్‌ సహా ఏడుగురు క్రీడాకారులకు కరోనా

ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో మొత్తం ఏడుగురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో టోర్నీ నిర్వహణలో కలకలం మొదలైంది..

Updated : 13 Jan 2022 10:58 IST

దిల్లీ: ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో మొత్తం ఏడుగురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో టోర్నీలో కలకలం మొదలైంది. మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌తో సహా ఏడుగురు వైరస్‌ బారినపడినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం వీరంతా ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రంలో ఉన్నారని చెప్పింది. వీరిలో రెండుసార్లు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించిన అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్‌ థక్కర్, ట్రెస్సా జోలీ, మిథున్‌ మంజునాథ్‌, సిమ్రన్‌ అమాన్‌ సింఘీ, కుషి గుప్తా ఉన్నారు. మరోవైపు ఈ క్రీడాకారుల డబుల్స్‌ పార్ట్‌నర్స్‌ సైతం టోర్నీ నుంచి వైదొలిగారని బీడబ్ల్యూఎఫ్‌ వెల్లడించింది.

ఈ క్రమంలోనే వైరస్‌ సోకిన వారికి బదులుగా వేరేవారిని తీసుకొనే ప్రసక్తి లేదని, దీంతో వారి ప్రత్యర్థులను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్‌ చేస్తామని బీడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) ధ్రువీకరించింది. కాగా, జనవరి 11న మొదలైన ఈ ఇండియా ఓపెన్‌ టోర్నీలో గురువారం రెండో దశ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ సమయంలోనే ఏడుగురు క్రీడాకారులకు వైరస్‌ సోకినట్లు తేలింది. అంతకుముందు సాయి ప్రణీత్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా తేలడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు క్రీడాకారులు సైతం గతంలో వైరస్‌ బారినపడటంతో ఇంగ్లాండ్‌ జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకొంది. దీంతో ఇప్పుడు టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఏఐ ఏం చేయనుందనేది ఆసక్తిగా మారింది. టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని