Pollard- Bravo: జట్టుకు ఎన్నో సేవలు అందించావు.. ఎంతో ఆప్తమిత్రుడివి: పొలార్డ్‌

 డ్వేన్‌ బ్రావో.. వెస్టిండీస్‌ క్రికెట్‌లో ఓ సంచలనం. భారత క్రికెట్‌ అభిమానులకూ సుపరిచితుడే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో...

Published : 07 Nov 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: డ్వేన్‌ బ్రావో.. వెస్టిండీస్‌ క్రికెట్‌లో ఓ సంచలనం. భారత క్రికెట్‌ అభిమానులకూ సుపరిచితుడే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బ్రావో ఆడుతున్న విషయం తెలిసిందే. మైదానంలోనూ, బయట తనదైన హావభావాలతో ప్రేక్షకులను అలరిస్తాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపి తన అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచే విండీస్‌ తరఫున బ్రావో చివరి మ్యాచ్‌. ఇప్పటికే ఇంటిముఖం పట్టిన వెస్టిండీస్‌.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి బ్రావోకు ఘనమైన వీడ్కోలు ఇద్దామనకుంటే.. ఓటమే ఎదురైంది. మ్యాచ్‌కు ముందు బ్రావోతో ఉన్న తన అనుబంధాన్ని వెస్టిండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ గుర్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘విండీస్‌ క్రికెట్‌’ ట్విటర్‌లో పోస్టు చేసింది. 

‘‘సర్‌ ఛాంపియన్‌ బ్రావో.. దాదాపు 18 ఏళ్లపాటు జాతీయ జట్టుకు సేవలందించడం అద్భుతం. క్రికెటర్‌గా నీ కన్నా చిన్నవాడిని. పదిహేడు ఏళ్ల కిందటే విండీస్‌ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌ ట్రెండ్‌ను స్టార్ట్‌ చేశావు. ఎప్పుడూ సరదాగా ఉంటావు. క్యారెక్టర్‌పరంగానే కాకుండా నువ్వు నాకు ఎంతో ఆప్తమిత్రుడివి. విండీస్‌ క్రికెట్‌కు అందించిన సేవలు అమోఘం. నిజంగా ఎంతో అభినందిస్తున్నా. మైదానంలో దేశ ప్రజల కోసం ఆడిన ప్రతిక్షణం గుర్తుండిపోతుంది. మేము నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాం. నీ జీవితంలో ఇది మరొక అవకాశం, ఇంకో అధ్యాయం మొదలుకానుంది. కృతజ్ఞతలు’ అంటూ పొలార్డ్‌ వ్యాఖ్యానించాడు. మా మధ్య స్నేహం గురించి ప్రపంచానికి తెలుసునని పేర్కొన్నాడు. 

2003లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బ్రావో వెస్టిండీస్‌ తరఫున 40 టెస్టుల్లో 2,200 పరుగులు, 86 వికెట్లు.. 164 వన్డేల్లో 2,968 పరుగులు, 199 వికెట్లు.. 91 టీ20 మ్యాచ్‌ల్లో 1,255 పరుగులు, 77 వికెట్లు పడగొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి దాదాపు 363 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 151 మ్యాచుల్లో 1,537 పరుగులు, 167 వికెట్లు తీశాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని