Gary Kirsten : ఇంగ్లాండ్‌ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌.!

టీమ్‌ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ ఇంగ్లాండ్‌ టెస్టు జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.! ఇటీవల యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఘోర పరాజయం పాలు కావడంతో.. ప్రస్తుత...

Published : 31 Dec 2021 20:37 IST

(Photo : Kirsten Twitter)

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ ఇంగ్లాండ్‌ టెస్టు జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.! ఇటీవల యాషెస్‌ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఘోర పరాజయం పాలవ్వడంతో ప్రస్తుత ఇంగ్లాండ్‌ హెడ్‌ కోచ్‌ క్రిస్ సిల్వర్ వుడ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో అతడిని కోచ్‌గా కొనసాగించడంపై సంధిగ్ధత నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలుండగానే ఆసీస్‌ 3-0 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. 

‘ఇంగ్లాండ్‌ జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేయడం గొప్ప గౌరవం. అందుకే అవకాశం ఉన్న ప్రతిసారీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. ఇంతకు ముందు 2015, 2019 సంవత్సరాల్లో కూడా నేను కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నాను. అయితే, అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగలేనని యాజమాన్యానికి స్పష్టంగా చెప్పాను. అందుకేనేమో నన్ను పక్కన పెట్టారు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్లో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు ఉండాలనే కొత్త ట్రెండ్‌ మొదలైంది. అందుకే, కోచ్‌ పదవి కోసం ప్రయత్నిస్తున్నాను. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను సిద్ధం చేస్తోంది. అందుకే ఆ జట్టు అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వన్డే జట్టు బలంగా కనిపిస్తోంది. టెస్టు జట్టును మాత్రం కొంచెం తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లతో టెస్టు జట్టును పటిష్టంగా తయారు చేయాలి’ అని గ్యారీ కిర్‌స్టెన్ అన్నాడు. 

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడైన గ్యారీ కిర్‌స్టెన్‌ 2008 నుంచి 2011 వరకు టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌గా పని చేశాడు. ఇతడి నేతృత్వంలోనే భారత జట్టు  2009లో టెస్టుల్లో తొలిసారిగా అగ్రస్థానానికి చేరింది. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో 2017 నుంచి 2019 వరకు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని