IPL: ‘నా స్కోరు కంటే జట్టు విజయమే ముఖ్యం’ 

శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. ఇందులో పంత్ సేన..7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 30 Apr 2021 15:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అహ్మదాబాద్ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు నిన్న తలపడ్డాయి. ఇందులో పంత్ సేన..7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. రసెల్‌ 45, గిల్‌ 43 పరుగులతో రాణించారు. లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీకి ఓపెనర్లు శుభారంభం అందించారు. 132 పరుగుల వద్ద దిల్లీ మొదటి వికెట్(ధావన్ 46) కోల్పోయింది. మరో ఓపెనర్ పృథ్వీ షా 82 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో స్టోయినిస్ దిల్లీకి విజయానందించాడు. ఈ మ్యాచ్‌పై ఎవరేమన్నారంటే..

‘‘ఈ మ్యాచ్‌ ఫలితం చాలా నిరాశకు గురిచేసింది. మేం చాలా నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాం. మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయాం. చివర్లో రసెల్‌ దూకుడుగా ఆడటంతో 150కి పైగా స్కోరు సాధించాం. పృథ్వీషా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో మేం ఏమి చేయలేకపోయాం. ఇది మా జట్టులోని లోపాలను ఎత్తిచూపుతోంది. మేం అన్ని విభాగాల్లో విఫలమయ్యాం. కమిన్స్‌ కొత్త బంతితో చక్కగా బౌలింగ్ చేశాడు. శివమ్ మావి గత మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు విఫలమయ్యాడు.  మనం తిరిగి రాణిస్తామని ఆశిద్దాం. మా జట్టులో ప్రతిభకు కొదవలేదు. కానీ, మేం దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలి’’

-ఇయాన్ మోర్గాన్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్

‘‘అతడు(పృథ్వీ షా) అద్భుతమైన ఆటగాడని మనందరికి తెలుసు. అతని మీద నమ్మకం ఉంచితే అద్భుతాలు చేయగలడు. అతనికి సాధారణంగా ఆడాలని చెప్పాం. ఇటువంటి మ్యాచ్‌ల్లో రన్‌రేట్ గురించి ఆలోచిస్తాం. క్రికెట్‌ను ఆస్వాదిస్తూ..మీ శక్తి మేరకు పరుగులు చేయండి అని ఆటగాళ్లకు చెబుతుంటాం. లలిత్ యాదవ్ మంచి ఆల్‌రౌండర్‌. అతని బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ, నేర్చుకుంటాడు. గత మ్యాచ్‌(బెంగళూరు)లో మేం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయాం. కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా’’

-రిషభ్ పంత్, దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌

‘‘ధైర్యంగా ఆడాలని నిర్ణయించుకున్నా. చెత్త బంతుల కోసం వేచి చూశా. శివమ్ మావితో నాలుగైదేళ్లుగా ఆడుతున్నా. కాబట్టి, అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో తెలుసు. మొదటి నాలుగు బంతులు పుల్‌ లెంగ్త్‌లో వచ్చాయి. తర్వాత  షార్ట్‌ బాల్‌ ఆడేందుకు సన్నద్ధం అయ్యాను. కానీ, మావి వేయలేదు. ఈ పిచ్‌పై ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌లో బంతి బ్యాట్ పైకి కాస్త ఆలస్యంగా వస్తోంది. ఆఫ్ స్టంప్‌, అవుట్ సైడ్ బంతులు ఎక్కువగా రావడంతో స్వేచ్ఛగా ఆడగలిగా. నేనెప్పుడూ వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించను. జట్టు విజయమే నాకు ముఖ్యం. ఇప్పటి వరకు సెహ్వాగ్‌తో మాట్లాడే అవకాశం రాలేదు. అవకాశం వస్తే తప్పకుండా మాట్లాడతా. ఎందుకంటే సెహ్వాగ్‌కు కూడా తొలి బంతికి బౌండరీ కొట్టడం లేదా పరుగులు చేయడాన్ని ఇష్టపడతాడు.

-పృథ్వీ షా, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌
 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు