IPL 2021: సానుకూల దృక్పథమే మమ్మల్ని గెలిపించింది : వెంకటేశ్‌ అయ్యర్‌

మా జట్టు యాజమాన్యం సానుకూల దృక్ఫథంతో వ్యవహరించడంతోనే ఐపీఎల్‌ రెండో అంచెలో అసాధారణ విజయాలు సాధ్యమయ్యాయని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్ వెంకటేశ్‌ అయ్యర్ తెలిపాడు. కోల్‌కతా ఘన విజయాలు..

Published : 15 Oct 2021 01:43 IST

(Photo: KKR Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: మా జట్టు యాజమాన్యం సానుకూల దృక్ఫథంతో వ్యవహరించడంతోనే ఐపీఎల్‌ రెండో అంచెలో అసాధారణ విజయాలు సాధ్యమయ్యాయని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్ వెంకటేశ్‌ అయ్యర్ తెలిపాడు. కోల్‌కతా ఘన విజయాలు సాధిస్తోందంటే.. దానికి కారణం కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, దాని వెనుక జట్టు యాజమాన్యం కృషి కూడా ఎంతో ఉందని అతడు పేర్కొన్నాడు. దిల్లీతో జరిగిన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌ ముగిసిన అనంతరం వెంకటేశ్ అయ్యర్ మాట్లాడాడు. ‘136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలనే ఉద్దేశంతో నేను బరిలోకి దిగలేదు. పవర్‌ ప్లే మొత్తం వికెట్‌ కోల్పోకుండా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత పరిస్థితులను బట్టి గేర్‌ మార్చాలనుకున్నాం. అయితే, మేం అనుకున్న దాని కంటే మెరుగ్గానే రాణించగలిగాం. శుక్రవారం చెన్నైతో జరుగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో.. వీలైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని వెంకటేశ్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. ఈ సీజన్ మొదటి దశలో కోల్‌కతా అంచనాలను అందుకోలేకపోయింది. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి.. ఐదింట్లో ఓటమి పాలైంది. అయితే, రెండో దశలో అద్భుతంగా పుంజుకుని వరుసగా విజయాలు సాధించి ఫైనల్‌కి చేరిన విషయం తెలిసిందే. 

‘పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వంటివి జట్టు విజయానికి సహకరించాయి. మైదానంలో మేం ఎలా నడుచుకుంటామో, బయట కూడా అలాగే వ్యవహరించాం. అందుకే ఇక్కడి వరకు రాగలిగాం’ అని కేకేఆర్‌ చీఫ్‌ మెంటార్‌ డేవిడ్‌ హస్సీ తెలిపాడు. క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వెంకటేశ్‌ అయ్యర్‌ (55), శుభ్‌మన్‌ గిల్ (46) కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని