KL Rahul: అర్ధశతకానికి 40.. సెంచరీకి 62 బంతులు.. కేఎల్‌ రాహుల్‌ ‘రికార్డు’ ఇన్నింగ్స్‌ సాగిందిలా!

టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul) అద్భుత శతకంతో కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును అధిగమించాడు. నెదర్లాండ్స్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడేశాడు.

Updated : 13 Nov 2023 11:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటర్ సెంచరీ చేసే అవకాశాలు చాలా తక్కువ. అప్పటికే సగానికిపైగా ఓవర్లు ముగిసిపోతాయి. కుదురుకోవడానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది. మరో ఎండ్‌లో ధాటిగా ఆడే బ్యాటర్‌ ఉంటే.. యాంకర్‌ రోల్‌ పోషించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రికార్డు సెంచరీ సాధించడమంటే సాధారణ విషయం కాదు. ఆ ఘనత భారత బ్యాటర్‌ కేఎల్ రాహుల్‌ (KL Rahul) అందుకొన్నాడు. అందులోనూ వన్డే ప్రపంచకప్‌లోనే భారత్‌ తరఫున వేగవంతమైన (62 బంతుల్లో) శతకం బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అతడి సెంచరీ ఇన్నింగ్స్‌ సాగిందిలా..

30వ ఓవర్‌లో తొలి పరుగు..: స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (51) ఔటైన తర్వాత కేఎల్ రాహుల్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. అప్పటికి భారత్‌ స్కోరు 29 ఓవర్లకు 200/3. మరోవైపు క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్ నిలకడగా ఆడుతున్నాడు. అప్పుడు శ్రేయస్‌ స్కోరు 30 బంతుల్లో 31 పరుగులు. బాస్ డి లీడ్ వేసిన ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ పరుగుల ఖాతా తెరిచాడు. 

40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ: ఆరంభంలో ఆచితూచి ఆడిన కేఎల్‌ రాహుల్‌ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను తాకాడు. అప్పటికే శ్రేయస్‌ అయ్యర్‌ 71 బంతుల్లో 80 పరుగులతో సెంచరీ వైపు దూసుకుపోతున్నాడు. వీరిద్దరూ కలిసి శతక భాగస్వామ్యం పూర్తి చేసేశారు. ఇన్నింగ్స్‌లోని 43వ ఓవర్‌లో కేఎల్ అర్ధశతకం సాధించాడు. దీంతో భారత్‌ స్కోరు 312/3. 

22 బంతుల్లోనే మరో ఫిఫ్టీ+: ఒకవైపు 46వ ఓవర్‌ నాటికి శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ (84 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ ముగియడానికి ఇంకా నాలుగు ఓవర్లు మాత్రమే ఉన్నాయి. అప్పటికి కేఎల్ రాహుల్‌ స్కోరు 51 బంతుల్లో 70 పరుగులతో ఉన్నాడు. ఇక తన బ్యాటింగ్‌లోనూ రాహుల్‌ టాప్‌ గేర్‌కు వెళ్లిపోయాడు.  కేవలం 11 బంతుల్లోనే మిగతా 31 పరుగులు రాబట్టేశాడు. రెండో హాఫ్ సెంచరీని కేవలం 22 బంతుల్లోనే సాధించాడు. అంటే మొత్తం 62 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను తాకేశాడు. దీంతో భారత్‌ స్కోరు 400కి చేరింది.

అద్భుత ఇన్నింగ్స్‌కు తెర: రికార్డు సెంచరీతో అలరించిన కేఎల్‌ రాహుల్‌ 102 పరుగుల (64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) వ్యక్తిగత స్కోరు వద్ద  బాస్‌ డి లీడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి నిర్మించిన 208 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని