Irfan Pathan: రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్‌ అద్భుతం: ఇర్ఫాన్‌ పఠాన్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలిటెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ ఒంటరి పోరాటం సీనియర్లను ఆకట్టుకొంది. అతడో అద్భుతమైన ప్రతిభావంతుడని పొగడ్తలతో ముంచెత్తారు. 

Updated : 27 Dec 2023 16:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమ్‌ ఇండియా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను వెటరన్‌ ఆటగాళ్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా ఈ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయాడు. బౌలర్లకు పూర్తిగా అనుకూలిస్తున్న సెంచూరియన్‌ పిచ్‌పై రాహుల్‌ కళాత్మకమైన షాట్లతో అలరించాడని పేర్కొన్నాడు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ చేశాడు. ‘‘ లాఫ్టెడ్‌ డ్రైవ్‌లు, దూకుడైన పుల్‌షాట్లు, గోడకట్టినట్లున్న డిఫెన్స్‌, అద్భుతమైన స్థిరత్వం... ఇలా రాహుల్‌ ఇన్నింగ్స్‌లో అన్నీ ఉన్నాయి. జట్టుకు అవసరమైన సమయంలో అసాధారణ ఆటతీరును కనబర్చాడు’’ అని పేర్కొన్నాడు. 

ఓపెనర్‌గా అతడి అనుభవం విలువైనది..

ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌కు ఉన్న అనుభవం అమూల్యమైందని టీమ్‌ ఇండియా మాజీ బ్యాటర్‌ సంజయ్‌ బంగర్‌ అభివర్ణించాడు. తొమ్మిదేళ్ల టెస్ట్‌ కెరీర్‌లో రెండో సారి మాత్రమే రాహుల్‌ తొలి మూడు స్థానాలు కాకుండా కింది పొజిషన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. ఈ అంశాన్ని బంగర్‌ ప్రస్తావిస్తూ..‘‘కొత్త బంతిని ఎదుర్కోవడంలో అతడికి అద్భుతమైన అనుభవం ఉంది. దాదాపు 25 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ అనుభవం అత్యంత అమూల్యమైంది. అంతేకాదు.. 1-6 స్థానాల్లో ఎక్కడైనా అతడు బ్యాటింగ్‌ చేయగలడు. అదే అతడిని వెల్‌ రౌండెడ్‌ ఆటగాడిగా తీర్చిదిద్దింది. ఆఫ్‌ స్టంప్‌ బయటకు వెళ్లే బంతుల విషయంలో రాహుల్‌ నిర్ణయాలకు తిరుగులేదు. నాణ్యమైన ఇన్నింగ్స్‌లను ఆడేందుకు ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నాడు.  

సైన్యంలో చేరాలనుకుని.. క్రికెటర్‌గా మారి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో రోజు ఆటలో భారత్‌ 245 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు రాహుల్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 137 బంతుల్లో 101 పరుగులు చేశాడు. వీటిల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. పదో వికెట్‌గా అతడు వెనుదిరిగాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని