Updated : 08 May 2022 09:53 IST

KL Rahul: ఇంతకుమించి ఎక్కువ ఆశించలేను: కేఎల్‌ రాహుల్

(Photo: KL Rahul Instagram)

ముంబయి: టీ20 లీగ్‌లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాపై 75 పరుగుల భారీ విజయం సాధించడంతో లఖ్‌నవూ సారథి కేఎల్‌ రాహుల్‌ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు నుంచి ఇంతకు మించి మంచి ప్రదర్శన ఆశించలేనని చెప్పాడు. మ్యాచ్‌ అనంతరం రాహుల్‌ మాట్లాడుతూ తమ ఆటగాళ్ల ప్రదర్శనను మెచ్చుకున్నాడు.

‘మేం ఈ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా ఆడాం. నా రనౌట్‌ ఒక్కటే నిరాశపర్చింది. క్వింటన్‌ డికాక్‌ (50), దీపక్‌ హూడా (41) ఆడిన తీరు చూస్తే ఇక్కడ పరుగులు తేలిగ్గా చేయొచ్చనే అభిప్రాయం కలిగింది. చివర్లో స్లాయినిస్‌ (28), జేసన్‌ హోల్డర్‌ (13) ధాటిగా ఆడి మంచి స్కోర్‌ అందించారు. తర్వాత బంతితోనూ మా బౌలర్లు రాణించారు. ఇంతకుమించి వారినుంచి ఎక్కువ ఆశించలేను. ఆటగాళ్లకు నైపుణ్యాలు ఉండటం ఒక్క ఎత్తయితే, వాటిని ఎప్పుడు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసి ఉండటం కూడా అంతే ముఖ్యం. మరోవైపు కోల్‌కతా బ్యాటింగ్‌లో రస్సెల్‌ (45) ఆడేటప్పుడు కొన్నిసార్లు భయమేసింది. కానీ, మా బౌలర్లు ప్రణాళికలకు కట్టుబడి బౌలింగ్ చేశారు. అయితే, మేం మెరుగవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కీలక సమయంలో రాణిస్తున్నామో లేదో తెలియదు కానీ, విజయాలు మాత్రం సాధిస్తున్నాం. అందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

అన్ని విధాలా దెబ్బతీశారు: శ్రేయస్‌

ఇక ఈ ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలను పూర్తిగా సంక్లిష్టం చేసుకున్న కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పందిస్తూ.. లఖ్‌నవూ తమని అన్ని విధాలా దెబ్బతీసిందని చెప్పాడు. ‘వాళ్లు మమ్మల్ని బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా రెండు విధాలా చిత్తుచేశారు. మేం బౌలింగ్‌ చేసేటప్పుడు చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులివ్వడమే కాకుండా బ్యాటింగ్‌లో పవర్‌ప్లేలోనే పలు వికెట్లు కోల్పోయి పేలవంగా ఆరంభించాం. పిచ్‌ ఎలా స్పందిస్తుందన్నది అర్థం చేసుకోలేకపోయాం. అందువల్లే టాస్‌ గెలిచి కూడా బౌలింగ్‌ ఎంచుకున్నాం. దీంతో వారిని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించి 160లోపు కట్టడి చేస్తామనుకున్నా. కానీ, చివరికి వాళ్లు చాలా మంచి స్కోర్‌ సాధించారు. నేనూ, మా కోచ్‌ ఛేదన గురించే ఆలోచించాం. మధ్య ఓవర్లలో బాగా బౌలింగ్‌ చేస్తున్నా చివర్లోనే తడబడుతున్నాం. అలాగే పవర్‌ప్లేలోనూ సరిగ్గా ఆడలేకపోతున్నాం. దీంతో రాబోయే మూడు మ్యాచ్‌ల్లో ఈ విషయాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని