KL Rahul : కెప్టెన్‌గా రాహుల్‌కి గొప్ప భవిష్యత్తు ఉంది : గౌతమ్‌ గంభీర్‌

టీమ్ఇండియా యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌పై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా అతడికి గొప్ప భవిష్యత్‌ ఉందని పేర్కొన్నాడు. కేవలం నాలుగు మ్యాచుల ఫలితాలను...

Published : 01 Feb 2022 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్ఇండియా యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌పై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా అతడికి గొప్ప భవిష్యత్‌ ఉందని పేర్కొన్నాడు. కేవలం నాలుగు మ్యాచుల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ నాయకత్వ పటిమపై ఓ అంచనాకు రావడం సరికాదని అన్నాడు. వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగు పెట్టనున్న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ) జట్టుకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా, గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘గెలుపోటములను సమానంగా స్వీకరించడమే నాయకుడి లక్షణం. విజయం సాధిస్తే ఉప్పొంగిపోవడం, ఓటమి ఎదురైతే కుంగిపోవడం రాహుల్‌కి తెలియదు. అతడిలోని గొప్ప లక్షణం కూడా ఇదే. కెప్టెన్సీ అనేది ఒక్క రోజులో  నేర్చుకుంటే వచ్చేది కాదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతి రోజూ మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నించాలి. అప్పుడే అత్యుత్తమంగా రాణించగలం. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా అన్ని సాధించేశామని గొప్పలు చెప్పుకోవడం కూడా  సరికాదు. రాహుల్‌కి బ్యాటర్‌గానే కాకుండా, నాయకుడిగానూ గొప్ప భవిష్యత్తు ఉంది. అతడు చాలా ప్రశాంతంగా, ఆట పట్ల నిబద్ధతతో ఉంటాడు. అలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే, అతడి విషయంలో ఇంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేయడం సరికాదు. కేవలం నాలుగు మ్యాచుల ఫలితాలను బట్టి అతడి నాయకత్వ పటిమను అంచనా వేయలేం’ అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ దూరం కావడంతో.. వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఘోర పరాజయం పాలైంది. అంతకు ముందు జరిగిన రెండో టెస్టుకు వెన్ను నొప్పి కారణంగా విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. అప్పడు కూడా కేఎల్ రాహుల్‌ జట్టుని నడిపించాడు. ఈ టెస్టులో కూడా టీమ్‌ఇండియా ఓడిపోయింది. దీంతో రాహుల్‌ సారథ్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లోనూ కెప్టెన్‌గా రాహుల్‌కి పేలవ రికార్డే ఉంది. వ్యక్తిగత ప్రదర్శనపరంగా గొప్పగా రాణించినా.. సారథిగా విజయవంతం కాలేకపోయాడు. గత రెండు సీజన్లలోనూ పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయినా, ఒక్కసారి కూడా తన జట్టుని ప్లే ఆఫ్స్‌ చేర్చలేకపోయాడు. రాహుల్‌ ప్రస్తుతం వన్డే, టీ20 ఫార్మాట్లకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని