
IND vs SA: వన్డే సిరీస్ కోసం.. ప్రాక్టీస్ మొదలెట్టారు..!
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి వన్డే జరగనున్న బోలాండ్ పార్క్‌లో ప్రస్తుతం భారత జట్టు సాధన చేస్తోంది. కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లకు సూచనలు చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోలను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
ఇటీవల టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ.. ఇక నుంచి అన్ని ఫార్మాట్లలో పూర్తి స్థాయి బ్యాటర్‌గా కొనసాగనున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ జట్టుని నడిపించనున్నాడు. దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. ఎలాగైనా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించని కారణంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. కరోనా పాజిటివ్ కారణంగా వన్డే సిరీస్‌కు దూరమైన యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ స్థానంలో.. జయంత్ యాదవ్‌ని, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డ పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో.. నవదీప్ సైనీని తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
భారత వన్డే జట్టు ఇదే..
కేఎల్ రాహుల్ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ