KL Rahul: ఐపీఎల్‌ ఆడేందుకు కేఎల్‌ ఉత్సాహం.. కానీ, ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిందే!

కేఎల్ రాహుల్‌ (KL Rahul) ఫిట్‌నెస్‌ను బీసీసీఐ ఇంకా ధ్రువీకరించలేదు. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టుకు ఇప్పటికే దూరమైన అతడు.. ఐపీఎల్‌లో ఆడేందుకు మాత్రం ఉత్సాహంగా ఉన్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఐపీఎల్‌ తర్వాత టీ20 ప్రపంచ కప్‌ జరగనుంది.

Published : 04 Mar 2024 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మధ్యలో గాయం కారణంగా వైదొలిగిన భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి వస్తోంది. తాజాగా లండన్‌ వెళ్లి ప్రత్యేక వైద్యులతో చికిత్స చేయించుకుని భారత్‌కు తిరిగొచ్చాడు. నేరుగా జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కి వెళ్లి తన ఫిట్‌నెస్‌ స్థాయిని అంచనా వేసుకోనున్నాడు. ఎన్‌సీఏ ధ్రువీకరిస్తేనే అతడు ఐపీఎల్‌లో ఆడతాడనే కథనాలు వస్తున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌ అయిన కేఎల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోకుండా ఆడితే.. మధ్యలో ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. ఈ మెగా లీగ్‌ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచ కప్‌ జరగనుంది. అందుకే, అతడి విషయంలో ఎలాంటి రిస్క్‌ను బీసీసీఐ తీసుకోదు. వికెట్‌ కీపింగ్‌ - బ్యాటర్‌గా పొట్టి కప్‌లో కీలకం కానున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఫిట్‌గా ఉండటమూ ముఖ్యమే. 

‘‘లండన్‌లో అత్యుత్తమ వైద్య బృందాన్ని కేఎల్ సంప్రదించాడు. ఆదివారమే అతడు భారత్‌కు తిరిగొచ్చాడు. బీసీసీఐ జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్లాడు. త్వరలోనే రాహుల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ను ఎన్‌సీఏ జారీ చేయనుంది. ఐపీఎల్‌లో తన సత్తాను నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అతడు కీపర్-బ్యాటర్‌గా సేవలందించేందుకు ముందు వరుసలో ఉండాలని భావిస్తున్నాడు’’ అని క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్‌ రాయల్స్‌తో మార్చి 24న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ తలపడనుంది. 

రంజీల్లో ఆడినా.. ఐపీఎల్‌ గురించే చర్చ: మనోజ్‌ తివారీ

ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత క్రికెటర్ మనోజ్‌ తివారీ బీసీసీఐ, ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేం దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలోనూ.. కొత్త ఆటగాళ్లు, కాస్త పేరున్న ప్లేయర్లూ ఐపీఎల్‌ గురించి చర్చించుకొనేవాళ్లు. ఒక్కసారి ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకుంటే చాలనే అభిప్రాయం ఉండేది. రంజీల్లో పెద్దగా ఆదాయం ఉండదు. కానీ, ఐపీఎల్‌లో ఒక్కో సీజన్‌ బాగా ఆడితే కనీసం రూ.5 నుంచి 7 కోట్ల వరకు అందుకోవచ్చు. అందుకే, కొందరు రంజీ మ్యాచుల సమయానికి గాయపడినట్లు సృష్టిస్తారు. బౌండరీ లైన్‌ వద్ద డైవ్‌ చేసి బంతిని ఆపినట్లు ప్రయత్నించి స్వల్పంగా గాయపడుతుంటారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని.. ఐపీఎల్‌ నాటికి సిద్ధమవుతారు’’ అని తివారీ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని