KL Rahul: రెండు రోజుల్లోపే ముగింపు.. ఎలా జరిగిందో ఇంకా అర్థం కాలేదు: కేఎల్ రాహుల్

దక్షిణాఫ్రికా పర్యటనను టీమ్‌ఇండియా (SA vs IND) విజయవంతంగా ముగించింది. కేఎల్ రాహుల్ తొలి టెస్టులో శతకం సాధించిన విషయం తెలిసిందే.

Updated : 05 Jan 2024 12:26 IST

ఇంటర్నెట్ డెస్క్: కేప్‌ టౌన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ (SA vs IND) విజయం సాధించింది. అయితే, కేవలం ఒకటిన్నర రోజుల్లోనే టెస్టు ముగియడం గమనార్హం. దీనిపై క్రికెట్ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. భారత వికెట్ కీపర్‌ కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా ఇదెలా సాధ్యమైందో అర్థం కావడం లేదన్నాడు. అయితే, గెలవడం ఎంతో ఆనందంగా ఉందని.. ప్రత్యేకమైనదని అభివర్ణించాడు. ఈ విజయంతో.. కేప్‌ టౌన్‌లో గెలిచిన ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.

‘‘కేప్‌ టౌన్‌లో తొలిసారి విజయం సాధించడం ఆనందంగా ఉంది. దక్షిణాఫ్రికాలో నేను ఆడిన మూడో సిరీస్‌. గతంలో ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఓటమే ఎదురైంది. ఇప్పుడీ విజయంతో ఆ ఓటములకు ముగింపు పలికాం. తొలి ఇన్నింగ్స్‌లో గొప్పగా బ్యాటింగ్‌ చేయలేకపోయాం. కానీ, మా బౌలర్లు అద్భుతం చేశారు. అందుకే ఈ విజయం మరెంతో ప్రత్యేకం. భావోద్వేగాలపరంగా ఇది ఎవరికీ అర్థం కాదు. టాస్‌ ఇప్పుడే పడింది.. అంతలోనే మ్యాచ్‌ ముగిసిందన్నట్లుగా ఇది సాగింది. పిచ్ ఇలా మారుతుందని అనుకోలేదు. బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురైంది.

తొలి టెస్టులో మేం ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఓడిపోయాం. దీంతో సిరీస్‌ను గెలిచే అవకాశాలు కోల్పోయాం. అయితే, సిరీస్‌ను సమం చేసే ఛాన్స్‌ మాత్రమే మా ముందుంది. దీంతో రెండో టెస్టు కోసం మా ప్రణాళికల్లో కాస్త మార్పులు చేశాం. మా యాటిట్యూడ్ మార్చుకున్నాం. గత నాలుగైదేళ్లుగా విదేశాల్లోనూ గట్టి పోటీనిస్తున్నాం. కొన్ని సిరీస్‌లనూ గెలిచాం. టెస్టు క్రికెట్‌ ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాం’’ అని కేఎల్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని