SA vs IND: మా కుర్రాళ్లకు ఇచ్చిన మెసేజ్‌ అదే.. వారి పాత్రేంటో గుర్తు చేశా: కేఎల్ రాహుల్

దక్షిణాఫ్రికాపై మూడో వన్డేలో (SA vs IND) భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది.

Updated : 22 Dec 2023 13:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా గడ్డపై ఆరేళ్ల తర్వాత భారత్‌ వన్డే సిరీస్‌ గెలిచింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కీలకమైన మూడో మ్యాచ్‌లో సెంచరీతో సంజూ శాంసన్‌ రాణించగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ అండ్‌ కో అదరగొట్టేసింది. సిరీస్‌ విజయం అనంతరం భారత కెప్టెన్ కేఎల్ రాహుల్, దక్షిణాఫ్రికా సారథి మార్‌క్రమ్‌ మాట్లాడారు.

ఆస్వాదిస్తూ ఆడాలని చెప్పా: కేఎల్

‘‘కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎప్పుడూ బాగుంటుంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టా. వన్డే సిరీస్‌ గెలవడం ఆనందంగా ఉంది. ఈ జట్టులోని ఆటగాళ్లతో ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడా. యువ క్రికెటర్లకు నేనిచ్చే సందేశం ఒక్కటే.. మీ ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండి. మిగతా వాటి గురించి ఆందోళన చెందొద్దు. జట్టులో వారి పాత్రను గుర్తు చేశాను. ఇప్పుడున్నవారిలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ, కొందరికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేదు. అయినా వందశాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు. కానీ, జాతీయ జట్టుకు వచ్చేసరికి కొన్ని కారణాల వల్ల టాప్‌ఆర్డర్‌లో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఇవాళ మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు’’ అని కేఎల్ వ్యాఖ్యానించాడు.

ఆ లక్ష్యం ఛేదించగలమని భావించాం: మార్‌క్రమ్‌

‘‘కీలకమైన మూడో వన్డేలో ఓడిపోవడం తీవ్రంగా బాధించింది. పార్ల్‌ మైదానం చాలా బాగుంది. భారీగా అభిమానులు మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చారు. వారిని మేం నిరాశపరిచాం. జట్టులోని సభ్యులంతా మంచి ఫామ్‌లోనే ఉన్నారు. కానీ, సరైన  దిశగా పయనించలేకపోయాం. చివరి వరకూ పిచ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. భారత్‌ నిర్దేశించిన 290 పైచిలుకు లక్ష్యం ఛేదించగలమని భావించాం. బౌలింగ్‌లో బాగానే రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌లో వెనకబడ్డాం. టాస్‌ అంశం కీలకమే కాదు. రాబోయే టెస్టు సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. దక్షిణాఫ్రికాలోని రెండు గొప్ప మైదానాల్లో టెస్టులు జరగబోతున్నాయి. క్రికెట్‌ అభిమానులకు ఇది పండగే’’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని