KL Rahul: సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ ప్రభావం నాపై తీవ్రంగా ఉంది: కేఎల్ రాహుల్‌

లఖ్‌నవూ రెగ్యులర్‌ సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) గాయం కారణంగా ఐపీఎల్‌ సీజన్‌లోని కీలక సమయంలో వైదొలిగాడు. కానీ, అతడి స్థానంలో కృనాల్ పాండ్య జట్టును నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన ట్రోలింగ్‌ను కేఎల్ రాహుల్‌ వెల్లడించాడు.

Published : 18 May 2023 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్: గత బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ నుంచి టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ జరిగింది. ప్రస్తుత ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లను ఆడిన రాహుల్‌.. గాయం కారణంగా టోర్నీతోపాటు వచ్చేనెలలో జరిగే (జూన్ 7 నుంచి) ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కూ దూరమయ్యాడు. లఖ్‌నవూ సూపర్  జెయింట్స్‌ సారథ్య బాధ్యతలను కేఎల్ నుంచి కృనాల్ పాండ్య తీసుకున్నాడు. తాజాగా ముంబయిపై లఖ్‌నవూ విజయం సాధించి ప్లేఆఫ్స్‌ రేసులోకి అడుగు ముందుకేసింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వచ్చిన ట్రోలింగ్  తనపై తీవ్ర ప్రభావం చూపిందని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. తనలాగే ఇతర క్రికెటర్లూ ప్రభావితులైన వారిలో ఉన్నారని పేర్కొన్నాడు. ఏ ఆటగాడు కూడానూ కావాలనే చెత్తగా ఆడరని, ఇదంతా జీవితంలో ఓ భాగమని చెప్పాడు. 

‘‘సోషల్‌మీడియా ట్రోలింగ్‌ వల్ల నాతోపాటు ఇతర ప్లేయర్లపైనా ప్రభావం పడింది. ఇలాంటి సమయంలోనే ఆటగాళ్లకు మద్దతు చాలా అవసరం. ఇలా ఇతరుల మీద కామెంట్‌ లేదా ట్రోలింగ్‌ చేయడాన్ని తమ హక్కుగా కొందరు భావిస్తారు. వారేం కామెంట్లు చేయాలని అనుకుంటారో అదే చేసేస్తారు. క్రికెటర్లు ఎవరూ కూడానూ కావాలని చెత్తగా ఆడాలని కోరుకోరు. ఇది మన జీవితం. నాకు క్రికెట్‌ కాకుండా మరొకటి తెలియదు. క్రికెట్‌ ఆడటం మాత్రమే నాకు తెలుసు. నేను  సీరియస్‌గా లేనని, కష్టపడనని ప్రతి ఒక్కరూ ఎందుకు అనుకుంటారు? క్రీడల్లో మరీ దారుణంగా ప్లేయర్లను ట్రోల్స్‌ చేస్తారు. నేను ఎంత కష్టపడినా.. ఫలితం మన వైపు లేకపోతే ఏం చేయలేం కదా’’ అని రాహుల్‌ తెలిపాడు. 

ది మ్యాంగో గయ్‌.. నవీనుల్‌ హక్‌

ముంబయిపై విజయం సాధించడంతో లఖ్‌నవూ ఆటగాళ్లు జోష్‌ మీదున్నారు. ఈ సందర్భంగా సహచరుడు నవీనుల్‌ హక్‌తో కలిసి నికోలస్‌ పూరన్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తమ బస్‌లో హోటల్‌ గదికి చేరుకునే క్రమంలో.. నికోలస్ పూరన్‌ మాట్లాడుతూ.. నవీనుల్‌ను ‘ది మ్యాంగ్‌ గయ్‌’గా అభివర్ణించాడు.  గతవారం ముంబయి - బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (1) త్వరగా ఔట్‌ కావడంతో నవీనుల్‌  ‘స్వీట్‌ మ్యాంగోస్‌’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేశాడు. దానిని గుర్తు చేస్తూ పూరన్‌ ఇలా కామెంట్లు చేశాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు