KL Rahul: కేఎల్‌ రాహుల్‌ను వదిలేసిన పంజాబ్‌.. స్పందించిన ఓపెనర్‌

గత రెండు సీజన్లలో పంజాబ్‌ కింగ్స్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను...

Published : 02 Dec 2021 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత రెండు సీజన్లలో పంజాబ్‌ కింగ్స్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టిన ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆ జట్టు వదులుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలోకి వెళ్లాలని రాహుల్‌ భావిస్తున్నాడని పీబీకేఎస్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తెలిపాడు. ‘‘మేం రాహుల్‌ను కెప్టెన్‌గా ఉంచుదామని భావించాం. అయితే అతడు మాత్రం వేలంలోకి వెళ్లాలని భావించాడు. ఆటగాడి ఇష్టం ప్రకారమే రిటెయిన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని గౌరవించి రాహుల్‌ను వదిలేసుకున్నాం’’ అని వివరించాడు. దీంతో మయాంక్ అగర్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ను మాత్రమే పంజాబ్‌ రిటెయిన్‌ చేసుకుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. ‘‘ ఇదొక అద్భుతమైన ప్రయాణం. మీ ప్రేమకు కృతజ్ఞతలు. మరో చోట కలుద్దాం’’ అని పోస్ట్‌ చేశాడు. 

ఆర్‌సీబీ వదిలేయడంతో కేఎల్ రాహుల్‌ను పంజాబ్‌ కింగ్స్‌ 2018 వేలంలో రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. అలానే రవిచంద్రన్‌ అశ్విన్‌ దిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోవడంతో 2020 సీజన్‌తోపాటు 2021 సీజన్‌కు రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించింది. 2018 సీజన్‌లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు, 2020లోనూ 670 పరుగులు, రెండు విడతల్లో జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ (2021)లో 626 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా మంచి ఫామ్‌ను కనబరిచిన రాహుల్‌ జట్టును నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడని ఫ్రాంచైజీ నమ్మడంతోనే వదిలేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని