KL Rahul: మరోసారి చెబుతున్నా.. స్ట్రైక్‌రేట్‌పై నాది అదే మాట: కేఎల్ రాహుల్‌

క్రికెట్‌లో (Cricket) స్ట్రైక్‌రేట్‌ చాలా కీలకమని అందరికీ తెలుసు. అయితే స్ట్రెక్‌రేట్‌ కోసం దూకుడుగా ఆడాలని చూస్తే మాత్రం వికెట్‌ కోల్పోక తప్పదు. 

Published : 07 Mar 2023 16:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం టీమ్‌ఇండియా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భాగంగా ఆసీస్‌తో నాలుగు టెస్టుల (IND vs AUS) సిరీస్‌ను ఆడుతోంది.  ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల తర్వాత భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టు మ్యాచ్‌ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆసీస్‌తోనే వన్డే సిరీస్‌లో తలపడనుంది. అనంతరం మార్చి 31 నుంచి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2023) మొదలుకానుంది. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్‌రేట్‌పై సోషల్‌ మీడియా వేదికగా చర్చ కొనసాగుతోంది. తాజాగా దీనిపై టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul) ప్రత్యేకంగా స్పందించాడు. స్ట్రైక్‌రేట్‌పై అతిగా అంచనా వేస్తున్నారని వ్యాఖ్యానించాడు. లఖ్‌నవూ కెప్టెన్‌ అయిన రాహుల్‌ గత సీజన్‌లోనూ మెరుగ్గానే రాణించాడు. 

లఖ్‌నవూ కొత్త జెర్సీ లాంచ్‌ ఈవెంట్ సందర్భంగా రాహుల్‌, గౌతమ్‌ గంభీర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ మాట్లాడుతూ.. ‘‘ఫార్మాట్‌ ఏదైనా సరే స్ట్రైక్‌రేట్‌ కీలకమే. కానీ, దానిని అతిగా అంచనా వేసి చెప్పడం సరైంది కాదు. ఇదే మాట గతంలోనూ నేను చెప్పా. పరిస్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. మీరు మ్యాచ్‌లో 140 పరుగులనే ఛేదించాల్సి వచ్చిందనుకోండి.. అప్పుడు 200 స్ట్రైక్‌రేట్‌ అవసరం లేదు. అందుకే, మ్యాచ్‌నుబట్టి బ్యాటింగ్ దూకుడుగా చేయాల్సి ఉంటుంది’’ అని తెలిపాడు. గత కొన్నేళ్లుగా భారత్‌ తరఫున గొప్పగా రాణించలేకపోతున్న కేఎల్ రాహుల్‌పై ఆసీస్‌తో మూడో టెస్టులో వేటు పడింది. అయితే, అతడి స్థానంలో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ కూడా గొప్పగా ఏమీ రాణించలేదు. దీంతో నాలుగో టెస్టులో రాహుల్‌కు చోటు కల్పించాలనే డిమాండ్లూ వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని