KL Rahul: అతియా అప్పుడు నాకంటే ఎక్కువ బాధపడింది: కేఎల్ రాహుల్

ఐపీఎల్‌ 2023లో గాయపడినప్పుడు తన సతీమణి అతియా శెట్టి (Athiya Shetty) ఎంతో మద్దతుగా నిలిచిందని కేఎల్ రాహుల్ (KL Rahul) పేర్కొన్నాడు. 

Updated : 01 Jan 2024 19:19 IST

ఇంటర్నెట్ డెస్క్: కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ - 2023లో గాయపడి కొన్ని నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. పునరాగమనంలో రాహుల్ అదరగొట్టేస్తున్నాడు. ప్రపంచకప్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ రాణించాడు. తొలి టెస్టులో రాహుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గతేడాది ఐపీఎల్‌లో గాయపడినప్పుడు తన సతీమణి అతియా శెట్టి (Athiya Shetty) మద్దతుగా నిలిచిందని రాహుల్ పేర్కొన్నాడు. తాను వేగంగా కోలుకోవడంలో ఆమె కీలకపాత్ర పోషించిందన్నాడు.

‘‘అతియా ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటుంది. ఐపీఎల్‌లో నేను గాయపడినందుకు నాకంటే ఆమే ఎక్కువగా నిరుత్సాహానికి లోనైంది. కోప్పడింది కూడా. అప్పుడు నేను ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించాను. ఆమెను అలా చూడటం అదే మొదటసారి. ఇది మా ఇద్దరికీ కఠినమైన సమయం. కానీ, ఆ కాలంలో మా ఇద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. గాయం ప్రభావంతో నాలో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండేందుకు చిన్న చిన్న సంతోషాలను పూర్తిగా ఆస్వాదించేలా తోడ్పాటునందించింది. నా భార్య, కుటుంబసభ్యుల సహకారంతోనే వేగంగా కోలుకున్నా. మైదానంలో ఉన్నప్పుడు తన గురించి ఆలోచించను. ఆటపైనే దృష్టిసారిస్తా. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే బాగా ఆడుతామనే విషయం ఆమెకు తెలుసు. నన్ను అర్థం చేసుకుంటుంది. నేను సరైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను’’ అని కేఎల్ రాహుల్ వివరించాడు. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె, నటి అతియాని కేఎల్ రాహుల్ గతేడాది జనవరిలో వివాహమాడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని