KL Rahul: డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూరంగా ఉంటా: ఇన్‌స్టాలో కేఎల్‌ రాహుల్‌

లఖ్‌నవూ రెగ్యులర్‌ సారథి కేఎల్ రాహుల్ (KL Rahul) ఈ ఐపీఎల్‌ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూరమైనట్లే. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌ తన గాయంతో సహా ఇతర విషయాలపై సుదీర్ఘంగా పోస్టు రాసుకొచ్చాడు.

Updated : 05 May 2023 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2023 టోర్నీలో (IPL 2023) బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కూ దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. కేఎల్‌ రాహుల్‌ తన గాయం పరిస్థితిని అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే సర్జరీ చేయించుకోనున్నట్లు వెల్లడించాడు. లఖ్‌నవూకు రాహుల్‌ స్థానంలో కృనాల్‌ పాండ్య సారథ్య బాధ్యతలు చేపడతాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ పాండ్యనే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కేఎల్ రాహుల్‌ కీలక విషయాలను తెలిపాడు. 

‘‘బీసీసీఐ వైద్య బృందం సహకారంతో త్వరలోనే నా తొడ గాయానికి సర్జరీ చేయించుకోబోతున్నా. కొద్ది వారాల్లోనే తిరిగి కోలుకుని మైదానంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టమే కానీ, ఇదే సరైనదని భావిస్తున్నా. లఖ్‌నవూ జట్టు సారథిగా మరింత బాధిస్తుంది. కీలకమైన సమయంలో జట్టును వీడాల్సి వచ్చింది. అయితే, జట్టు సహచరులు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటారని ఆశిస్తున్నా. బయట నుంచి వారిని ఎల్లవేళలా ప్రోత్సహిస్తూనే ఉంటా. ప్రతి మ్యాచ్‌ను వీక్షిస్తా.

అలాగే వచ్చే నెలలో  ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ భాగం కాలేకపోతున్నా. అయితే, త్వరలోనే బ్లూ జెర్సీ వేసుకొని ఆడతానని బలంగా నమ్ముతున్నా. ప్రస్తుతం మాత్రం గాయం నుంచి కోలుకుని రావడంపైనే దృష్టి పెడుతున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అభిమానుల ఆశీస్సులతో బలంగా తిరిగి వస్తా. ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్, బీసీసీఐ, జట్టు సభ్యులు కష్టసమయాల్లో మద్దతుగా నిలిచారు. మీ ప్రోత్సాహంతో ఇంతకుముందు కంటే మరింత ఫిట్‌గా తయారై జట్టుతో కలుస్తా.  గాయానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను మీతో పంచుకుంటా’’ అని కేఎల్ రాహుల్‌ వెల్లడించాడు.

ప్రస్తుత సీజన్‌లో లఖ్‌నవూ 10 మ్యాచ్‌లను ఆడి 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. లీగ్‌ దశలో మరో నాలుగు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. మరోవైపు జూన్ 7 నుంచి జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆసీస్‌తో భారత్‌ తలపడనుంది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ స్థానంలో టీమ్‌ఇండియాలోకి సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకొనే అవకాశం లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు