KL Rahul: దీపక్‌.. మరీ అంత నెట్‌ ప్రాక్టీస్‌ అవసరం లేదు: కేఎల్ రాహుల్‌

లఖ్‌నవూ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ హుడా బాగా ఆడుతున్నా నెట్స్‌లో మరీ ఎక్కువసేపు ప్రాక్టీస్‌ చేస్తాడని ఆ జట్టు కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు...

Published : 06 Apr 2022 02:11 IST

(Photos: Deepak Hooda, KL Rahul Instagram)

ముంబయి: లఖ్‌నవూ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ హుడా బాగా ఆడుతున్నా నెట్స్‌లో మరీ ఎక్కువసేపు ప్రాక్టీస్‌ చేస్తాడని ఆ జట్టు కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. తాజాగా ఆ జట్టు హైదరాబాద్‌పై 12 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన అనంతరం మాట్లాడాడు. చాలా కాలంగా దీపక్‌ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడని, ఇప్పుడు వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడని చెప్పాడు.

‘నేను దీపక్‌తో గత మూడు-నాలుగేళ్లుగా కలిసి ఆడుతున్నా. నెట్స్‌లో చాలాసేపు ప్రాక్టీస్‌ చేస్తాడు. అస్సలు బయటకు రాడు. ఒక ఆటగాడు బాగా ఆడుతున్నప్పుడు నెట్స్‌లో అంత సాధన చేయాల్సిన అవసరం లేదు. అయినా, అతడు మాత్రం ప్రాక్టీస్‌ చేయకుండా ఉండలేడు. అవకాశాల కోసం చాలా కాలం ఎదురుచూశాడు. ఇప్పుడు వచ్చినవాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు. దాంతో ఇప్పుడు మిడిల్‌ ఆర్డర్‌లో జట్టు తనపై  ఆధారపడేలా తయారవుతున్నాడు’ అని లఖ్‌నవూ కెప్టెన్‌ పేర్కొన్నాడు.

ఇక హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోవడం సరైంది కాదని చెప్పాడు. తాము పరిస్థితులకు తగ్గట్టు అలవాటు పడటానికి కాస్త సమయం కావాలన్నాడు. అలాగే తమ జట్టులో బ్యాటింగ్‌ డెప్త్‌ కూడా బాగుందని తెలిపాడు. అయితే, రిస్క్‌ తీసుకోకుండా ఎలా ఆడాలనే దానిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నాడు. అనంతరం తమ బౌలింగ్‌పై మాట్లాడిన రాహుల్‌.. గత మూడు మ్యాచ్‌ల్లో తమ బౌలర్లు అద్భుతంగా బంతులేశారన్నాడు. ఇప్పుడు జేసన్‌ హోల్డర్‌ కూడా తోడవ్వడంతో అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో జట్టుకు మరింత బలం పెరిగిందని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని