Yashasvi Jaiswal: అతడి ఇన్నింగ్స్‌కు ‘హ్యాట్స్‌ ఆఫ్‌’.. యశస్విపై ప్రశంసల వర్షం.

యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) ఆట గురించే ఇప్పుడు అంతటా చర్చ. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 12 May 2023 13:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  అతడు కొట్టిన షాట్ల ముందు ‘ఈడెన్‌ గార్డెన్స్‌’ చిన్నబోయింది. ఆట చూస్తున్నామా.. మ్యాచ్‌ హైలైట్స్‌ చూస్తున్నామా.. అన్నరీతిలో అతడి విధ్వంసం కొనసాగింది. ఈ క్రమంలో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ శతకం రికార్డు అతడికి దాసోహమంది. అద్భుత ఆటతీరుతో అదరగొడుతున్న రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) ఇన్నింగ్స్‌ గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. నిన్నటి మ్యాచ్‌ (KKR vs RR)లో త్రుటిలో శతకం చేజారినా.. జట్టు పట్ల తన నిబద్ధతతో అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియాలో యశస్విపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

విరాట్‌ కోహ్లీ (Virat Kohli), కేఎల్‌ రాహుల్‌(KL Rahul) వంటి ఆటగాళ్లు జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను కొనియాడారు. అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ నమోదు చేసి తన రికార్డును బద్దలుకొట్టడంపై కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. యశస్వి ఇన్నింగ్స్‌కు ‘హ్యాట్స్‌ ఆఫ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ‘‘నేను చూసిన అత్యంత బెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. యశస్విది ఎంతో అద్భుతమైన టాలెంట్‌’’ అని విరాట్‌ మెచ్చుకున్నాడు.

జైస్వాల్ బ్యాటింగ్ ఆపడానికి ఏకైక కారణం.. మేము లక్ష్యాన్ని చేరుకోవడమే - రాజస్థాన్‌ రాయల్స్‌

• ఇది యశస్వి జైస్వాల్‌ రోజు. అద్భుతంగా ఆడాడు - కోల్‌కతా నైట్‌రైడర్స్‌

• ఐపీఎల్‌లో యశస్వి ఇన్నింగ్స్‌ అద్భుతం. అతడిని బీసీసీఐ టీమ్‌ఇండియాలోకి తీసుకోవాలి - బ్రెట్‌లీ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.

ఈ సీజన్‌లో మొదటి నుంచి భీకర ఫామ్‌తో చెలరేగుతున్న యశస్వి జైస్వాల్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో.. నిన్నటి మ్యాచ్‌లో కోల్‌కతా విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్‌ ఒక్క వికెట్టే కోల్పోయి కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో పాటు పాయింట్ల పట్టికలో కావాల్సినంత నెట్‌రన్‌రేట్‌నూ సంపాదించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని