Rishabh Pant: ఒత్తిడిలో ఎలా ఆడాలో కోహ్లీ నేర్పుతాడు: పంత్

టీ20 ప్రపంచకప్‌ మెగా సమరాన్ని భారత్‌ దాయాది పోరుతో మొదలుపెట్టనుంది. ఆదివారం ఈ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో రిషభ్ పంత్‌ మాట్లాడుతూ.. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే అని తెలిపాడు.

Published : 20 Oct 2022 12:12 IST

మెల్‌బోర్న్‌: ఆటలో ఒత్తిడితో కూడుకున్న పరిస్థితులను ఎదుర్కోవడంలో విరాట్‌ కోహ్లీ అపార అనుభవం చాలా ఉపయోగపడుతుందని స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ ఆదివారం భారత్‌, పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌ వెబ్‌సైట్‌ పంత్‌ను ఇంటర్వ్యూ చేయగా.. అతడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. పాక్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందన్న పంత్‌.. గతేడాది టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో దాయాదుల పోరును గుర్తుచేసుకున్నాడు.

‘‘వాస్తవ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో కోహ్లీ నేర్పుతాడు. అది మన క్రికెట్‌ ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అతడితో బ్యాటింగ్‌ చేయడం చాలా బాగుంటుంది. కోహ్లీ వంటి అనుభవజ్ఞుడితో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఉత్తమం. దాని వల్ల మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఆటను ఎలా ముందుకు తీసుకెళ్లాలి.. ఒత్తిడి పరిస్థితుల్లో బంతులను పరుగులుగా ఎలా మలచాలి అన్నది నేర్పిస్తాడు’’ అని రిషభ్ తెలిపాడు.

ఈ సందర్భంగా గతేడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘ఆ మ్యాచ్‌లో హసన్‌ అలీ బౌలింగ్‌లో నేను ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాను. ఆ రోజు టీమిండియా మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. దీంతో నేను, విరాట్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాం. రన్‌రేట్‌ను పెంచే ప్రయత్నం చేశాం. ఆ సమయంలోనే నేను ఒంటి చేత్తో రెండు సిక్స్‌లు కొట్టడం నాకు గుర్తుంది’’ అని పంత్‌ గుర్తుచేసుకున్నాడు.

అది భావోద్వేగాలతో కూడిన మ్యాచ్‌..

దాయాది పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందని పంత్‌ అన్నాడు. ‘‘పాక్‌తో ఆట అంటే ఎంతో హైప్‌ ఉంటుంది. అది భావోద్వేగాలతో కూడుకున్న మ్యాచ్‌. ఆటగాళ్లకే కాదు.. అభిమానులు.. ప్రతి ఒక్కరూ ఎంతో ఉద్వేగంతో చూస్తారు. అదో విభిన్న అనుభూతి. మైదానంలోకి అడుగుపెట్టగానే ఆ కోలాహలం అంతా మరో స్థాయిలో ఉంటుంది. అందుకే పాక్‌తో ఆట ఎప్పుడూ ప్రత్యేకంగానే అనిపిస్తుంది’’ అని పంత్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని