Kohli : కోహ్లీ అహాన్ని వదిలేసి ఆడాడు : గౌతమ్‌ గంభీర్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అహం వదిలేసి ఆడాడని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ అన్నాడు. క్రమశిక్షణతో ఆడుతూ ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు....

Published : 13 Jan 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అహం వదిలేసి ఆడాడని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ అన్నాడు. క్రమశిక్షణతో ఆడుతూ ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అతడి షాట్‌ సెలెక్షన్‌ మెరుగ్గా ఉందని ప్రశంసించాడు.

‘విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఆటగాళ్లు తమ అహాన్ని వదిలేసి వెళ్లాలని కోహ్లీ ఇంతకు ముందే పలుమార్లు చెప్పాడు. గతంలో ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా కూడా అతడు ఇదే మాట చెప్పాడు. విరాట్‌ నేడు ఆ మాటను నిరూపించుకున్నాడు. ఎంతో సహనంతో బ్యాటింగ్‌ చేశాడు. సఫారీ బౌలర్లు వైవిధ్యమైన బంతులతో సవాల్ చేసినా ఏకాగ్రతతో ఆడాడు. సహచర ఆటగాళ్ల నుంచి సరైన సహకారం అందకున్నా.. క్రమశిక్షణతో బ్యాటింగ్ చేశాడు. బలహీనతను అధిగమిస్తూ.. ఆఫ్‌ స్టంప్‌ ఆవల వెళ్తున్న బంతులను వదిలేశాడు. బౌలర్లపై ఆదిపత్యం చెలాయించకుండా తన పని తాను చేసుకుపోయాడు. తన అహాన్ని పక్కన పెట్టి జట్టుకోసం విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

* సెంచరీ కన్నా గొప్ప ఇన్నింగ్స్‌ ఇది..

సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టులో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌ ఆడటంపై పలువురు క్రికెటర్లు స్పందించారు. కోహ్లీ సెంచరీ అందుకోలేకపోయినా.. అంతకు మించిన గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడని ప్రశంసలు కురిపించారు. బ్యాటర్లకు సవాల్‌ విసిరే కేప్‌ టౌన్‌ పిచ్‌పై కోహ్లీ గొప్పగా రాణించాడని పేర్కొన్నారు. ‘కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌ ఆసాంతం తన క్లాస్‌ బ్యాటింగ్‌తో కట్టిపడేశాడు’ అని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీట్ చేశాడు. మరోవైపు వసీం జాఫర్‌, ఆర్పీ సింగ్, ఆకాశ్‌ చోప్రా, దినేశ్‌ కార్తిక్‌ తదితరులు కోహ్లీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని