Virat Kohli : ‘కోహ్లీ రివ్యూ సిస్టమ్‌’ అంటే ఇదీ.. మైదానంలో విరాట్‌ దూకుడు

పంజాబ్‌తో మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ(Virat Kohli) మైదానంలో మెరుపులు మెరిపించాడు. తనదైన వ్యూహాలతో జట్టుకు విజయాన్నందించాడు.

Updated : 21 Apr 2023 13:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : మనకు ధోనీ(MS Dhoni) రివ్యూ సిస్టమ్‌ తెలుసు. అతడు ఏదైనా రివ్యూ తీసుకున్నాడంటే.. ఫలితం అనుకూలంగా రావాల్సిందే. అంత కచ్చితంగా ఉంటాయి మహేంద్రుడి లెక్కలు. గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ(Virat Kohli) కూడా అంతే పక్కాగా కన్పించాడు. పెద్దగా అంచనాలు లేని చోట రివ్యూ(DRS) తీసుకొని.. సానుకూల ఫలితం పొంది అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

గాయం కారణంగా కెప్టెన్‌ డుప్లెసిస్‌(Faf Du Plessis) పంజాబ్‌(PBKS)తో మ్యాచ్‌లో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథ్య బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. మైదానంలో మునుపటి దూకుడును ప్రదర్శించాడు. సహచర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ.. తనదైన వ్యూహాలతో ముందుకెళ్లాడు. సిరాజ్‌(Mohammed Siraj) వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే పంజాబ్‌ ఓపెనర్‌ అథర్వ(4) ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే.. ముందు సిరాజ్‌ అప్పీల్‌ చేసినప్పటికీ.. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ.. సిరాజ్‌పై ఎంతో నమ్మకముంచిన కోహ్లీ.. చివరి క్షణంలో డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. ఫలితం అనుకూలంగా రావడంతో తనదైన స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు కోహ్లీ. నాలుగో ఓవర్‌లో సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లీ.. లివింగ్‌స్టోన్‌పై మరోసారి డీఆర్‌ఎస్‌ కోరాడు. ఈ ఫలితం కూడా బెంగళూరుకే అనుకూలంగా వచ్చింది. దీంతో కెప్టెన్‌గా కోహ్లీ మళ్లీ ఫైర్‌లోకి వచ్చాడంటూ అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ‘ఇది డీఆర్‌ఎస్‌ కాదు.. కేఆర్‌ఎస్‌’,  ‘బెంగళూరు డీఆర్‌ఎస్‌లు కోరి వంద శాతం విజయవంతమైంది’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ (84; 56 బంతుల్లో 5×4, 5×6), కోహ్లి (59; 47 బంతుల్లో 5×4, 1×6) అదరగొట్టడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఛేదనలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సిరాజ్‌ (4/21) దెబ్బకు పంజాబ్‌ 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని