IPL 2021: బెంగళూరుపై కోల్‌కతా విజయం 

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 11 Oct 2021 23:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో దిల్లీతో తలపడనుంది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా జట్టు 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో బెంగళూరు లీగ్‌ నుంచి నిష్క్రమించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (29), వెంకటేశ్ అయ్యర్ (26) శుభారంభం అందించారు. నితీశ్ రాణా (23), సునీల్‌ నరైన్ (26) రాణించారు. ఆఖర్లో వచ్చిన షకిబుల్ హసన్‌ (9), ఇయాన్ మోర్గాన్‌ (5)నిలకడగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకు ముందు 18వ ఓవర్లో మహమ్మద్ సిరాజ్‌ సునీల్ నరైన్‌, దినేశ్‌ కార్తిక్‌ (10) ఔట్ చేయడంతో మ్యాచ్‌ కొంచెం ఉత్కంఠగా మారింది. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 7 పరుగులు అవసరం కాగా మొదటి బంతిని షకిబుల్‌ హసన్‌ బౌండరీకి తరలించడంతో లక్ష్యం సులువైంది. అనంతరం మిగతా మూడు బంతుల్లో మూడు సింగిల్స్‌ తీసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్‌, యుజువేంద్ర చాహల్, మహమ్మద్‌ సిరాజ్‌ తలో రెండు వికెట్లు తీశారు.   

అంతకు ముందు, టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌ (21) శుభారంభం చేశారు. వేగంగా ఆడుతున్న క్రమంలో లాకీ ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో బౌలింగ్‌లో పడిక్కల్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్‌ భరత్‌ (9) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సునీల్‌ నరైన్‌ వేసిన పదో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్‌ ఇచ్చి పెలిలియన్‌ చేరాడు. గ్లెన్ మాక్స్‌వెల్‌ (15)తో కలిసి నిలకడగా ఆడుతున్న కోహ్లి.. సునీల్‌ నరైన్‌ 13వ ఓవర్లో బౌల్డయ్యాడు. డి విలియర్స్‌ (11) కూడా రాణించలేకపోయాడు. నరైన్‌ వేసిన 15వ ఓవర్లో బౌల్డై పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు స్కోరు నెమ్మదించింది. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ నిలకడగా ఆడుతూ పరుగులు చేయడానికి ప్రయత్నించిన మాక్స్‌వెల్‌ నరైన్‌ వేసిన 17వ ఓవర్లో ఫెర్గూసన్‌ చేతికి చిక్కాడు. ఆఖర్లో వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ (13), డేనియల్ క్రిస్టియన్‌ (9) ఆకట్టుకోలేకపోయారు. హర్షల్ పటేల్‌ (8), జార్జ్‌ గార్టన్ (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ నాలుగు, లాకీ ఫెర్గూసన్‌ రెండు వికెట్లు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని