Kuldeep Yadav: వీడ్కోలు నిర్ణయం.. వారి వ్యక్తిగతం: కుల్‌దీప్‌ యాదవ్

భారత క్రికెట్‌కు ఘనమైన సేవలు అందించిన ముగ్గురు స్టార్‌ క్రికెటర్లు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Updated : 10 Jul 2024 13:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) నెగ్గిన తర్వాత భారత స్టార్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. వారిద్దరితోపాటు రవీంద్ర జడేజా కూడా వీడ్కోలు పలికాడు. ఇలా ఒకేసారి ముగ్గురి రిటైర్‌మెంట్ నిర్ణయం తీసుకోవడంపై భారత స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ స్పందించాడు. 

‘‘దక్షిణాఫ్రికాపై మేం చివరివరకూ పోరాడాం. మరీ ముఖ్యంగా ఆఖరి ఐదు ఓవర్లలో పేసర్లు అద్భుతం చేశారు. వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నాక ముగ్గురు ప్లేయర్లు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఇదంతా వారి వ్యక్తిగత నిర్ణయం. దీని గురించి మనం ఎక్కువగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్‌ కోసం ఎంతో చేశారు. యువకుల కోసం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాబట్టి, కుర్రాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా. వారు వరల్డ్‌ కప్‌ను నెగ్గాక ఈ ప్రకటన చేశారు. ఇంతకంటే ఘనమైన ముగింపు మరొకటి ఉండదు’’ అని కుల్‌దీప్‌ (Kuldeep Yadav) వ్యాఖ్యానించాడు. 


కోహ్లీతో నా స్నేహం అద్భుతం: ఛెత్రీ

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి ఇటీవలే వీడ్కోలు పలికిన సునీల్ ఛెత్రీ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మంచి స్నేహితులని తెలుసు కదా.. ఇటీవల కోహ్లీ కూడా టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ క్రమంలో తన స్నేహితుడి గురించి ఛెత్రీ ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ‘‘కోహ్లీ అద్భుతమైన వ్యక్తి. చాలామందికి అతడిలోని మరో కోణం తెలియదు. చాలా ఫన్నీగా ఉంటాడు. ఇలాంటి వ్యక్తి దొరకడం  చాలా కష్టం. మేమిద్దరం ఒకే ప్లేస్‌ నుంచి వచ్చాం. ఒకేలాంటి కలలు కన్నాం. అయితే, విభిన్న గేమ్‌లను ఎంచుకున్నప్పటికీ.. మా భావం మాత్రం ఒక్కటే. అతడిపై నాకున్న గౌరవం ఎప్పటికీ తగ్గదు. విరాట్‌తో చాటింగ్‌ చేస్తుంటే.. ఎక్కువగా ఫన్నీ మీమ్స్‌ను షేర్‌ చేస్తూ ఉంటాడు. ప్రతీ విషయం గురించి మేం మాట్లాడుకుంటాం’’ అని ఛెత్రీ తెలిపాడు. 


అవన్నీ నిరాధార ఆరోపణలే: శ్రీలంక క్రికెట్ బోర్డు

టీ20 ప్రపంచకప్‌ సమయంలో తమ జట్టు ఆటగాళ్లు పార్టీల్లో పాల్గొన్నట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమేనని శ్రీలంక క్రికెట్ బోర్డు (Srilanka Cricket Board) కొట్టిపడేసింది. మూడు రోజుల కిందట స్థానిక పేపర్‌లో శ్రీలంక ఆటగాళ్లు జూన్‌ 3న డ్రింక్‌ పార్టీకి హాజరయ్యారనే వార్తలను హైలైట్‌ చేసింది. దీనిపై బోర్డు స్పందించింది. ‘‘ఇలాంటి ఆర్టికల్స్‌ను బోర్డు తీవ్రంగా ఖండించింది. అవన్నీ అవాస్తవాలే. కల్పిత కథనాలే. ఆధారాలు లేకుండా ఇలాంటివి ప్రచురించడం సరైన పద్ధతి కాదు. ఇలా వ్యవహరించడం వల్ల శ్రీలంక క్రికెట్ ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ఉంది’’ అని బోర్డు స్పష్టం చేసింది.


వాహబ్‌ రియాజ్‌, అబ్దుల్ రజాక్‌పై వేటు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. సెలక్షన్‌ కమిటీ నుంచి మాజీ క్రికెటర్లు అబ్దుల్ రజాక్, వాహబ్‌ రియాజ్‌ను పీసీబీ తప్పించింది. ‘‘వారిద్దరి సేవలు ఇక్కడితో ముగిశాయి. జాతీయ సెలక్షన్‌ కమిటీని పునరుద్ధరిస్తాం’’ అని ప్రకటన వెలువరించింది. టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్‌ స్టేజ్‌ నుంచి పాకిస్థాన్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని