WTC Finals: తీవ్ర నిరాశకు లోనయ్యా: కుల్‌దీప్‌ 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు తనని ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యానని టీమ్‌ఇండియా మణికట్టు స్పెషలిస్టు కుల్‌దీప్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. ఈనెల 28 నుంచి టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌...

Published : 07 Jun 2021 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు తనని ఎంపిక చేయకపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురయ్యానని టీమ్‌ఇండియా మణికట్టు స్పెషలిస్టు కుల్‌దీప్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. ఈనెల 28 నుంచి టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుండగా, ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో పోటీపడనుంది. ఈ క్రమంలోనే 24 మంది ఆటగాళ్ల బృందంతో కలిసి కోహ్లీసేన గురువారమే సౌథాంప్టన్‌కు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ కఠిన క్వారంటైన్‌లో ఉంది. అయితే, ఆ బృందంలో తాను లేకపోవడం బాధగా ఉందని కుల్‌దీప్ తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

‘నేను టీమ్‌ఇండియా జట్టులో లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే అందులో ఉండాలనుకున్నా. జట్టు విజయంలో నా వంతుగా కృషిచేసి వికెట్లు తీసి భాగస్వామి అవ్వాలనుకున్నా. అయితే, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటిటప్పుడు బాధపడటం కూడా సహజమే. మరోవైపు అదే సమయంలో వచ్చిన ఇతర అవకాశాల్లో రాణించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంగ్లాండ్‌కు వెళ్లలేదు. కాబట్టి, శ్రీలంక పర్యటనకు ఎంపికై అక్కడ రాణించే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నా. క్రికెట్‌ ఎప్పుడూ ఆడుతూనే ఉండాలి. తుది జట్టులో లేకపోతే ఏ ఆటగాడైనా బాధపడతాడు. ప్రతి ఒక్కరికీ జట్టులో ఉండాలని ఉంటుంది. కానీ, ఒక్కోసారి జట్టులో స్థానం లభించకపోవచ్చు’ అని కుల్‌దీప్‌ పేర్కొన్నాడు. కాగా, టీమ్‌ఇండియా కివీస్‌తో పోరులో గెలవాలని, కచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం ఉందని ఈ స్పిన్‌ బౌలర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని