Kumara Sangakkara: బట్లర్‌ బ్యాటింగ్‌ గురించి వర్ణించడం కష్టం: సంగక్కర

రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (824) ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే నాలుగు శతకాలు, నాలుగు అర్ధశతకాలతో దూసుకుపోతున్నాడు...

Published : 28 May 2022 15:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (824) పరుగులతో ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే నాలుగు శతకాలు, నాలుగు అర్ధశతకాలతో దూసుకుపోతున్నాడు. ఆదివారం గుజరాత్‌తో తలపడే ఫైనల్‌ మ్యాచ్‌లోనూ మరో వంద పరుగులు సాధిస్తే ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. అయితే, గతరాత్రి బెంగళూరుతో ఆడిన క్వాలిఫయర్‌-2లో అతడు నాలుగో సెంచరీ బాదడంపై రాజస్థాన్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కుమార సంగక్కర హర్షం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో బట్లర్‌ బ్యాటింగ్‌ గురించి వర్ణించడం కష్టమని అన్నాడు.

‘ఈ లీగ్‌లో బట్లర్‌ మా జట్టు కోసం ఏం చేశాడో చెప్పడం చాలా కష్టం. అతడు చాలా అద్భుతంగా టోర్నీని ప్రారంభించాడు. మధ్యలో కాస్త తడబడినా తిరిగి పుంజుకున్నాడు. అందుకోసం కేవలం ప్రాక్టీస్‌ మాత్రమే చేయకుండా తన బ్యాటింగ్‌కు సంబంధించిన అనేక విషయాలపై మాతో చర్చించి లోపాలను తెలుసుకున్నాడు. అతడు కూడా అందరిలాంటి ఆటగాడేనని, బరిలోకి దిగిన ప్రతిసారీ భారీ ఇన్నింగ్స్‌ ఆడలేననే నిజాన్ని గ్రహించాడు. అత్యుత్తమ బ్యాటింగ్‌ చేయాలంటే పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాలనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అతడు ఎలాంటి స్థితిలోనైనా దంచికొట్టగలడు. తన బ్యాటింగ్‌లో అన్ని వైవిధ్యమైన షాట్లను దాచిపెట్టుకున్నాడు. ఆటను కూడా బాగా అర్థం చేసుకుంటున్నాడు. దీంతో అవలీలగా పరుగులు సాధిస్తున్నాడు. నేనైతే ఈ టోర్నీలో ఇంత బాగా ఆడిన మరే ఆటగాడిని చూడలేదు’ అని సంగక్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని