Shane Warne : షేన్‌వార్న్‌కు స్నేహితుడివా.. అయితే నో స్లెడ్జింగ్‌: కుంబ్లే

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌ వార్న్‌ మృతికి ప్రముఖులు సంతాపం వెల్లడిస్తున్నారు. వార్న్‌తో...

Published : 06 Mar 2022 01:32 IST

గత స్మృతులను గుర్తుకు తెచ్చుకున్న టీమ్ఇండియా మాజీ దిగ్గజం

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్‌ మృతికి ప్రముఖులు సంతాపం వెల్లడిస్తున్నారు. వార్న్‌తో తమ అనుబంధాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షేన్‌ వార్న్‌కు ఇతర దేశాల క్రికెటర్లలోనూ స్నేహితులున్నారు. వారిలో భారత్‌కు చెందిన సచిన్‌ తెందూల్కర్‌, అనిల్‌ కుంబ్లే తదితరులు ముఖ్యులు. స్పిన్‌ దిగ్గజం ఇకలేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు. వార్న్‌తో కలిసి ఆడిన గత రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆటపరంగా తమ మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, అయితే మైదానం వెలుపల స్నేహభావంతో ఉండేవాళ్లమని కుంబ్లే పేర్కొన్నాడు. భారత్‌, లంక జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ముగింపు అనంతరం క్రీడా ఛానెల్‌తో కుంబ్లే మాట్లాడుతూ కొన్ని రహస్యాలను వెలువరించాడు. 

‘‘ఆసీస్‌ తరఫున టీమ్‌ఇండియాతో వార్న్‌ చాలా బాగా ఆడాడు. భారత ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడంలో దిట్ట. అలాంటిది మనపై రాణించేందుకు చాలా కష్టపడ్డాడు. 1998లో జరిగిన సిరీస్‌ సందర్భంగా ‘సచిన్ vs వార్న్‌’ పోరాటంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో వార్న్‌ పైచేయి సాధిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సచిన్‌ ఆధిక్యత ప్రదర్శించేవాడు. మరోక రహస్యం ఏమిటంటే.. ఒకవేళ మీరు షేన్‌ వార్న్‌కు స్నేహితుడైతే ఆసీస్‌ జట్టు స్లెడ్జింగ్‌కు అంత త్వరగా మొగ్గు చూపదు. నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు ఇలానే జరిగేదే’’ అంటూ తన స్నేహితుడి మృతికి కుంబ్లే ప్రగాఢ సానుభూతి తెలిపాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లోనూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించారు.  

వార్న్‌ మృతికి మాజీల సంతాపం

షేన్‌ వార్న్‌ మృతి చెందడంపట్ల మాజీ క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌, ఆసీస్ మాజీ సారథులు ఇయాన్‌ ఛాపెల్‌, రికీ పాంటింగ్, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్, బ్రెట్‌లీ, మార్క్‌వా, మాథ్యూ హెడెన్‌, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌, కెవిన్ పీటర్సెన్ సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వెల్లడించారు. దిగ్గజ బౌలర్‌గా ఎదిగిన షేన్‌ వార్న్‌.. వ్యక్తిత్వపరంగానూ నిజాయితీగా వ్యవహరించాడని గుర్తుచేసుకున్నారు.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని