IND vs AUS: భారత్‌తో టెస్టు సిరీస్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ కోసం ఎదురు చూస్తున్నా: ఆసీస్ బ్యాటర్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC)లో భాగంగా భారత్ (Team India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ (IND vs AUS) వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. 

Published : 14 Jan 2023 01:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్‌తో (Team India) ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌ కోసం ఆసీస్‌ (Aussies) ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా కీలక బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్ అయితే.. టీమ్‌ఇండియా టాప్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వెళ్లేందుకు ఈ సిరీస్‌ ఇరు జట్లకూ కీలకం. తొలి రెండు స్థానాల్లో ఆసీస్‌, భారత్‌ ఉన్నా.. శ్రీలంక కూడా మూడో స్థానంలో ఫైనల్‌ బెర్తు కోసం బరిలో ఉంది. 

‘‘గతంలో టీమ్‌ఇండియాతో జరిగిన సిరీస్‌ నుంచి స్పిన్‌ బౌలింగ్‌ గురించి ఆలోచించడం ప్రారంభించా. అశ్విన్‌ బౌలింగ్‌ గురించి విన్నప్పటి నుంచి నా ఆటతీరులో కాస్త మార్పు చేశా. అతడి బౌలింగ్‌ ప్రణాళికలను విఫలం చేయడానికి కసరత్తు కూడా మొదలుపెట్టా. అందుకే భారత్ - ఆసీస్‌ పోరు చదరంగం మాదిరిగా రసవత్తరంగా ఉండటం ఖాయం. టెస్టు సిరీస్‌ కోసం నేను ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికే నా ఆలోచనలను సిద్ధం చేసుకొన్నా. ఇక మ్యాచ్‌ సమయంలో అమలు చేయడమే తరువాయి. ఫలితం సానుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నా’’ అని లబుషేన్ తెలిపాడు. 

గావస్కర్ - బోర్డర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌తో నాలుగు టెస్టులు, మూడు వన్డేలను ఆడేందుకు ఆసీస్‌ ఫిబ్రవరిలో పర్యటించనుంది. ఫిబ్రవరి 9 నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. అనంతరం మార్చి 17 నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. అందులో భాగంగా వైజాగ్‌ వేదికగా రెండో వన్డేలో భారత్‌, ఆసీస్‌ తలపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని