Lalit Modi: లలిత్‌ మోదీకి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్‌ సపోర్ట్‌తో చికిత్స

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ (Lalit Modi) కరోనాబారినపడి లండన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. 

Published : 14 Jan 2023 18:22 IST

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ (Lalit Modi) తీవ్ర అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు.  ‘రెండువారాల్లో రెండుసార్లు కరోనా సోకడంతోపాటు న్యూమోనియా బారినపడ్డాను. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో కుమారుడి సహాయంతో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్‌కు వచ్చి  ఆసుపత్రిలో చేరా. దురదృష్టవశాత్తు ఇప్పటికీ 24/7ఆక్సిజన్ సపోర్ట్‌తోనే ఉన్నా’ అని ఆస్పత్రి బెడ్‌పై తాను ఉన్న ఫొటోలు, వీడియోలను లలిత్‌ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. లలిత్‌ మెదీ చేసిన పోస్ట్‌కి భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని భజ్జీ ఆకాంక్షించారు.    

మరోవైపు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్‌ మోదీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు.బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గతేడాది జులైలో లలిత్‌ మోదీ ప్రకటించడం సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.  అంతేకాకుండా సుస్మితాసేన్‌తో కలిసి ఉన్న ఫొటోలు ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం వైరల్‌ అయ్యింది. ఇంకా ఆమెను పెళ్లి చేసుకోలేదని, భవిష్యత్‌లో చేసుకునే అవకాశముందంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా.. ఆయన ఆక్సిజన్‌ సపోర్ట్‌పై  వైద్యం చేయించుకుంటున్నానంటూ పోస్టు చేయడం మరోసారి వైరల్‌ అవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు