వార్నర్‌ యోధుడు: టీమ్‌ఇండియాకు హ్యాట్సాఫ్‌

టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. భారత బౌలింగ్‌ ఎంతో క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా ఉందని తెలిపారు. మూడో టెస్టులో ఆసీస్‌ బ్యాటింగ్‌ కష్టాలకు పరిష్కారం కనుగొంటామని పేర్కొన్నారు. ‘వారియర్‌’ వార్నర్‌, విల్‌ పుకోవ్‌స్కీ జట్టులోకి రావడం ఖాయమని...

Published : 05 Jan 2021 19:50 IST

క్రమశిక్షణ, ప్రణాళికతో బౌలింగ్‌ చేస్తున్న భారత్‌: లాంగర్‌

సిడ్నీ: టీమ్‌ఇండియా బౌలింగ్‌పై ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. భారత బౌలింగ్‌ ఎంతో క్రమశిక్షణ, ప్రణాళికబద్ధంగా ఉందని తెలిపారు. మూడో టెస్టులో ఆసీస్‌ బ్యాటింగ్‌ కష్టాలకు పరిష్కారం కనుగొంటామని పేర్కొన్నారు. ‘వారియర్‌’ వార్నర్‌, విల్‌ పుకోవ్‌స్కీ  జట్టులోకి రావడం ఖాయమని వెల్లడించాడు. డిసెంబర్‌ 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే.

తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ తక్కువ స్కోర్ల గురించి ప్రశ్నించగా టీమ్‌ఇండియా అత్యంత కచ్చితత్వం, ప్రమాదకరంగా బంతులు విసురుతోందని లాంగర్‌ అన్నారు. ‘కొన్ని సిరీసుల నుంచి క్రమశిక్షణగా ఉండటం టీమ్‌ఇండియా అతిపెద్ద బలం. గత రెండు టెస్టులను నేనెంతో ఇష్టపడ్డాను. బ్యాటు, బంతి మధ్య పోరాటం ఉద్ధృతంగా సాగింది. టెస్టు క్రికెట్‌ అంటే ఇదే మరి’ అని ఆయన పేర్కొన్నారు. భారత బౌలర్లు స్ట్రెయిట్‌లైన్‌లో విసిరిన బంతులను ఎందుకు ఆడలేకపోతున్నారని అడగ్గా..

‘అది మేం ఆడుతున్న వికెట్లను బట్టి ఉంటుంది. ఆ పిచ్‌లపై సీమ్‌ మూమెంట్‌ ఉంటుంది. బంతి రెండు వైపులా స్వింగ్‌ అవుతుంది. టీమ్‌ఇండియా భిన్నంగా స్ట్రెయిట్‌లైన్‌ ఎంచుకొని ఫీల్డర్లను మోహరించి మా బ్యాటర్లకు బంతులు విసిరింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా గొప్ప బౌలర్లు. అలాంటివారు పరుగులు చేయనివ్వరు. ఆస్ట్రేలియా తరహా క్రికెట్ ఆడాలని మేమూ కోరుకుంటున్నాం. కానీ టీమ్‌ఇండియాను అభినందించి తీరాల్సిందే. ఎంతో ప్రణాళికా బద్ధంగా, క్రమశిక్షణగా, పోటాపోటీగా బౌలింగ్‌ చేసింది. తొలి టెస్టు ఆడని సిరాజ్‌ సైతం అనుభవజ్ఞుడిలా బంతులు విసిరాడు. మూడో టెస్టులో కొత్త బౌలర్‌ ఎవరొస్తారో చూడాలి. భారత బౌలింగ్‌ సవాల్‌కు తప్పకుండా ప్రతివ్యూహం కనుగొంటాం’ అని లాంగర్‌ అన్నారు.

ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌, విలియమ్‌ పుకోవ్‌స్కీ మూడో టెస్టు ఆడటం ఖాయమని లాంగర్‌ తెలిపాడు. మోకాలి కండరాల గాయంతో వార్నర్‌, కంకషన్‌తో పుకోవ్‌స్కీ తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. ‘తర్వాతి మ్యాచుకు వార్నర్‌ సిద్ధంగా ఉన్నాడు. అతడో యోధుడు! ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడని వచ్చిన తొలిరోజు నుంచీ చెబుతున్నాను. మైదానంలో చురుగ్గా కదులుతున్నాడు. బాగా ఆడాలన్న పట్టుదలతో ఉన్నాడు. టెస్టు  క్రికెట్లో పోటీని ఇష్టపడతాడు. పుకోవ్‌స్కీ సైతం సిద్ధంగా ఉన్నాడు. అతడు కాస్త స్టీవ్‌స్మిత్‌లా ఆడతాడు. ఈ వేసవిలో దేశవాళీ క్రికెట్‌ను విపరీతంగా ఆడాడు. వార్నర్‌ ఒక్కడే కాస్త తక్కువ ఆడాడు’ అని లాంగర్‌ తెలిపారు.

ఇవీ చదవండి
రోహిత్ శతకంతోనే తిరిగొస్తాడు: లక్ష్మణ్
జూలో జంతువుల్లా చేస్తారా: టీమ్‌ఇండియా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని