T20 Cricket: మునివేళ్లపై నిలబెట్టి.. సిక్సర్లతో ముగించారు

టీ20 క్రికెట్‌ అంటే చూసే ప్రేక్షకులకే కాదు మ్యాచ్‌లాడే క్రికెటర్లకూ నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. ఒక్కోసారి చివరి బంతివరకూ ఫలితం దాగుడుమూతలాడుతూ రెండు జట్ల ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేస్తుంది...

Published : 09 Apr 2022 13:17 IST

ఆఖరి బంతికి దంచికొట్టిన బ్యాట్స్‌మెన్‌ వీరే..!

టీ20 క్రికెట్‌లో ఒక్కోసారి చివరి బంతివరకూ ఫలితం దాగుడుమూతలాడుతూ రెండు జట్ల ఆటగాళ్లనూ ఒత్తిడికి గురిచేస్తుంది. అలాంటి క్షణాల్లో అసాధారణ పోరాటం చేసిన వాళ్లే విజేతగా నిలుస్తారు. మరీ ముఖ్యంగా ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టాల్సిన పరిస్థితుల్లో ఆ బ్యాట్స్‌మెన్‌ ఎదుర్కొనే ఒత్తడి మాటల్లో వర్ణించలేనిది. గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ తెవాతియా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఆఖరి రెండు బంతులకు 12 పరుగులు చేయాల్సిన స్థితిలో బంతిని చితకబాది గుజరాత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. అలా ఈ టీ20 టోర్నీలో ఇప్పటివరకూ చివరి బంతిని స్టాండ్స్‌లోకి తరలించి విజయాలు సాధించింది ఎవరో ఓ లుక్కేద్దాం..


బ్రావో ముగించాడిలా..

(Photo: Dwayne Bravo Instagram)

ఈ టోర్నీలో తొలిసారి ఆఖరి బంతికి సిక్సర్‌ సాధించి మ్యాచ్‌ను గెలిపించింది చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో. 2012లో కోల్‌కతాతో జరిగిన ఓ లీగ్‌ మ్యాచ్‌లో అతడు ఈఘనత సాధించాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 158/6 స్కోర్‌ సాధించగా.. చెన్నై 19 ఓవర్లకు 150/4 స్కోర్‌తో నిలిచింది. ఇక చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోనీ (28), బ్రావో (4) క్రీజులో ఉన్నారు. దీంతో అంతా చెన్నై విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే భాటియా వేసిన తొలి బంతికి బ్రావో సింగిల్‌ తీయడం, రెండో బంతికి ధోనీ ఔటవ్వడం చకాచకా జరిగిపోయాయి. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 8 పరుగులుగా మారింది. ఇక జడేజా క్రీజులోకి వచ్చి మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి ఒక పరుగు సాధించాడు. అనంతరం బ్రావో ఐదో బంతిని వదిలేయడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ సిక్సర్‌ సాధించి చెన్నైకి అద్భుత విజయం అందించాడు. చివరికి బ్రావో (11 నాటౌట్‌గా; 7 బంతుల్లో 1x6) పరుగులతో నిలిచాడు.


ధోనీ ఒక బౌండరీ, రెండు సిక్సులతో..

(Photo: Dhoni Instagram)

ఇక 2016లో ధోనీ ఉత్కంఠభరితమైన క్షణాల్లో రైజింగ్‌ పుణె జట్టును ఇలాగే గెలిపించాడు. అయితే, అతడు చివరి మూడు బంతుల్ని ఒక బౌండరీ, రెండు సిక్సర్లకు తరలించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 172/7 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో పుణె 19 ఓవర్లకు 150/6 స్కోర్‌తో విజయం కోసం పోరాడుతోంది. అప్పటికి ధోనీ (42), రవిచంద్రన్‌ అశ్విన్‌ (1) క్రీజులో ఉన్నారు. ఇక చివరి ఓవర్‌లో పుణె విజయానికి 23 పరుగులు అవసరమైన స్థితిలో ఉత్కంఠ నెలకొంది. అలాంటి ఒత్తిడిలోనూ ధోనీ రెచ్చిపోయాడు. అక్షర్‌పటేల్‌ వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతి డాట్‌బాల్‌గా నమోదవ్వగా తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లింది. ఇక మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచిన ధోనీ మూడో బంతిని వదిలేశాడు. దీంతో సమీకరణం ఆఖరి మూడు బంతుల్లో 16 పరుగులుగా మారింది. దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. అయితే, వాటిని పటాపంచలు చేస్తూ మహీ నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. ఇక చివరి రెండు బంతుల్నీ సిక్సర్లుగా దంచికొట్టి పుణెకు అపురూప విజయం ఖాయం చేశాడు. చివరికి ధోనీ (64 నాటౌట్‌; 32 బంతుల్లో 4x4, 5x6) పరుగులు సాధించాడు.


అంచనాల్లేని భరత్‌ గెలిపించాడు..

(Photo: KS Bharat Instagram)

గతేడాది బెంగళూరు, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఆఖరి బంతికి కోహ్లీ టీమ్‌ ఇలాగే విజయం సాధించింది. అయితే, ఏమాత్రం అంచనాలు లేని యువ బ్యాట్స్‌మన్‌ కేఎస్ భరత్‌ (78 నాటౌట్‌; 52 బంతుల్లో 3x4, 4x6) చివరి బంతికి విజయాన్ని ఖాయం చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 164/5 పరుగుల మోస్తరు స్కోర్‌ సాధించగా.. ఛేదనలో బెంగళూరు 19 ఓవర్లకు 150/3 స్కోర్‌తో నిలిచింది. ఆఖరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం కాగా భరత్‌ (70), గ్లెన్‌మాక్స్‌వెల్‌ (45) అప్పటికి క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే అవేశ్‌ ఖాన్‌ ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ చేయగా.. మాక్సీ తొలి మూడు బంతుల్లో 7 పరుగులే సాధించాడు. ఆపై భరత్‌ నాలుగో బంతిని వృథా చేయడంతో ఉత్కంఠ మరోస్థాయికి చేరింది. అయితే, ఐదో బంతికి రెండు పరుగులు చేయడంతో ఆఖరి బంతికి 6 పరుగులు అవరమయ్యాయి. అలాంటి స్థితిలో అవేశ్‌ వైడ్‌ బాల్‌ వేయడంతో బెంగళూరుకు ఒక అదనపు పరుగు లభించింది. దీంతో సమీకరణం ఒక బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆఖరి బంతిని దంచికొట్టిన భరత్‌ బెంగళూరుకు సిక్సర్‌తో విజయాన్ని అందించాడు.


ధోనీలాగే తెవాతియా ఆకట్టుకున్నాడు..

(Photo: Rahul Tewatia Instagram)

ఇక తాజాగా గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాట్స్‌మన్ రాహుల్‌ తెవాతియా (13 నాటౌట్‌; 3 బంతుల్లో 2x6) ఆకట్టుకున్నాడు. 2016లో ధోనీ పంజాబ్‌పై చివరి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచినట్లే ఈ మ్యాచ్‌లో తెవాతియా మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. దీంతో ఈ సీజన్‌లో గుజరాత్‌కు మూడో విజయాన్ని సొంతం చేశాడు. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 189/9 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో గొప్పగా పోరాడిన గుజరాత్‌ 19 ఓవర్లకు 171/3 స్కోర్‌తో నిలిచింది. అయితే, ఆఖరి ఓవర్‌లో విజయానికి 19 పరుగులు అవసరమైన వేళ గుజరాత్‌ బ్యాటింగ్‌ ఆందోళన కలిగించింది. అప్పటికి డేవిడ్‌ మిల్లర్‌ (1), హార్దిక్‌ పాండ్య (27) క్రీజులో ఉండగా. ఒడియన్‌ స్మిత్‌ బంతి అందుకున్నాడు. తొలి బంతిని వైడ్‌గా వేయగా.. మరుసటి బంతికే పాండ్య రనౌటయ్యాడు. దీంతో తెవాతియా క్రీజులోకి వచ్చి రెండో బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతిని మిల్లర్‌ బౌండరీకి తరలించడంతో సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులుగా మారింది. నాలుగో బంతికి మిల్లర్‌ మరో సింగిల్‌ తీయడంతో గుజరాత్‌ ఆశలు వదులుకుంది. ఈ నేపథ్యంలోనే తెవాతియా ఆఖరి రెండు బంతులను స్టాండ్స్‌లోకి తరలించి ఆ జట్టుకు అద్భుత ముగింపునిచ్చాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని