FIFA: ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ చరిత్రను తిరగరాసిన గోల్డెన్‌ గోల్‌..!

గోల్డెన్‌ గోల్‌ నిబంధన ఫ్రాన్స్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించింది. అత్యంత కఠినంగా సాగిన తొలి నాకౌట్‌ మ్యాచ్‌ను ఈ నిబంధన సాయంతో గెలుచుకొంది.

Updated : 25 Nov 2022 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 1998 ప్రపంచకప్‌లో తొలిసారి గోల్డెన్‌గోల్‌ నిబంధన ప్రవేశపెట్టారు. ఫ్రాన్స్‌ ఈ నిబంధనను అద్భుతంగా అందిపుచ్చుకొని ఏకంగా ప్రపంచకప్‌నే ఒడిసిపట్టింది. మ్యాచ్‌ సమయంలో ఇరుపక్షాలు సమ ఉజ్జీలుగా ఉంటే.. రెండు సార్లు 15 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో ఎవరు ముందు గోల్‌ కొడితే వారిని విజేతగా ప్రకటిస్తూ మ్యాచ్‌ను తక్షణమే ముగించేసేవారు. ఈ గోల్‌ను ‘గోల్డెన్‌ గోల్‌’గా వ్యవహరిస్తారు.

1998 ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశ అయిన ‘రౌండ్‌ ఆఫ్‌ 16’లో ఫ్రాన్స్‌-పరాగ్వే మధ్య జూన్‌ 28న పోరు జరిగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. కానీ, పరాగ్వే జట్టు గోల్‌పోస్టుకు గోడకట్టినట్లు రక్షణను ఏర్పాటు చేసింది. దీనిని మ్యాచ్‌ సమయంలో ఛేదించడం ఫ్రాన్స్‌ ఆటగాళ్ల వల్లకాలేదు. కానీ, నాకౌట్‌ దశ కావడంతో విజేతను నిర్ణయించడం తప్పనిసరి. దీంతో అదనపు సమయం కేటాయించాల్సి వచ్చింది. అప్పుడు కూడా హోరాహోరీ పోరు తప్పలేదు. తొలి అదనపు 15 నిమిషాల్లో గోల్‌ కాలేదు. చివరికి మ్యాచ్‌ 115వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు లారెంట్‌ బ్లాంక్‌ పరాగ్వే రక్షణ వలయాన్ని ఛేదించుకొంటూ ప్రపంచకప్‌ల చరిత్రలోనే తొలి గోల్డెన్‌ గోల్‌ చేశాడు. ఈ గోల్‌ సాయంతో ఫ్రాన్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరుకొంది. ఆ తర్వాత ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలో తొలి ప్రపంచకప్‌ను అందుకొంది. 

గోల్డెన్‌గోల్‌ నిబంధనను 1998, 2002 ప్రపంచకప్‌ల్లో మాత్రమే వినియోగించారు. 2006 ప్రపంచకప్‌ నుంచి నిబంధనలు మార్చారు. ప్రస్తుతం నిబంధన ప్రకారం అదనంగా కేటాయించిన 30 నిమిషాలను పూర్తిగా ఆడాల్సిందే. గోల్‌ కొట్టగానే ఆట ముగియదు. రౌండ్‌ ఆఫ్‌ 16, క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీఫైనల్స్‌, థర్డ్‌ ప్లేస్‌ మ్యాచ్‌కు ఇది వర్తిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని