Leander Paes: టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌కు అరుదైన గుర్తింపు

భారత టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అరుదైన ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటుకు ఆరుగురు ప్లేయర్స్‌ నామినేట్‌ కాగా.. అందులో లియాండర్‌ పేస్‌ కూడా ఉన్నాడు. దీంతో ఐటీహెచ్ఎఫ్‌కు నామినేట్‌ అయిన తొలి ఆసియా క్రీడాకారుడిగా నిలిచాడు.

Published : 27 Sep 2023 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టెన్నిస్‌ దిగ్గజ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అరుదైన ఘనత సాధించాడు. ‘ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌(ఐటీహెచ్‌ఎఫ్‌)’కు నామినేట్‌ అయిన తొలి ఆసియా క్రీడాకారుడిగా నిలిచాడు. 2024కు గానూ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌(ప్లేయర్‌ విభాగం)లో చోటు కోసం ఆరుగురు క్రీడాకారుల్లో లియాండర్‌ పేస్‌ స్థానం సంపాదించాడు. మిగతా క్రీడాకారుల్లో జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌, సెర్బియన్‌ ప్లేయర్‌ అనా ఇవనోవిచ్‌, స్పానీష్‌ ఆటగాడు కార్లోస్‌ మొయా, కెనడాకు చెందిన డేనియల్‌ నెస్టర్‌, ఇటాలియన్‌ ప్లేయర్‌ ఫ్లేవియా పెన్నెట్టా నామినేట్‌ అయినవారిలో ఉన్నారు.  

ఐటీహెచ్‌ఎఫ్‌కు నామినేట్‌ కావడంపై లియాండర్‌ పేస్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘మూడు దశాబ్దాలపాటు టెన్నిస్‌ ఆడాను. 130 కోట్లకుపైగా భారతీయుల తరఫున ఒలింపిక్స్‌లో, డేవిస్‌ కప్‌లో ప్రాతినిథ్యం వహించాను. ఇన్నాళ్ల నా కఠోర శ్రమకు గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. టెన్నిస్‌ నాకు ఎంతో ఇచ్చింది. ఈ నామినేషన్‌ కూడా ఎంతో మంది యువ క్రీడాకారుల్లో ఛాంపియన్‌ అవడానికి స్ఫూర్తి నింపుతుందని భావిస్తున్నా’ అని తెలిపాడు. ఈ సందర్భంగా లియాండర్‌ తన తల్లిదండ్రులు, తోబుట్టువులు, కోచ్‌లు, డేవిస్‌ కప్‌ కెప్టెన్లు, తన కెరీర్‌లో కీలక పాత్ర వహించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. లియాండర్‌ తన కెరీర్‌లో డబుల్స్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో మొత్తం 18 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకున్నాడు. డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌ స్థానం కూడా దక్కించుకున్నాడు. 

ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలుచుకున్న చైనాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి లి నా 2019లో ఐటీహెచ్‌ఎఫ్‌కు నామినేట్‌ అయింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లియాండర్‌ పేస్‌ పురుషుల్లో తొలి వ్యక్తిగా నిలిచాడు. 

ఇక లియాండర్‌తోపాటు ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌కు మరో భారతీయుడు నామినేట్‌ అయ్యాడు. కంట్రిబ్యూషన్‌ విభాగంలో ప్రముఖ జర్నలిస్ట్‌ రిచర్డ్‌ ఈవన్స్‌తోపాటు భారత టెన్నిస్‌ మాజీ ఆటగాడు విజయ్‌ అమృత్‌రాజ్‌ నామినేషన్‌లో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు