Legends League Cricket: ‘లెజెండ్స్‌ లీగ్‌’ ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక ఖరారు

లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) టోర్నీ 2022 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. అక్టోబరు 5వ తేదీన జయ్‌పుర్‌లోని..

Published : 29 Sep 2022 23:46 IST

(ఫొటో సోర్స్‌: ఎల్‌ఎల్‌సీ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎల్‌ఎల్‌సీ) టోర్నీ 2022 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక ఖరారైంది. అక్టోబరు 5వ తేదీన జైపుర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా తుది పోరు జరగనుంది. ఈ మేరకు లీగ్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్‌ రహేజా వెల్లడించారు. ప్రపంచస్థాయి మాజీ క్రికెటర్లు ఆడుతోన్న లీగ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను చారిత్రక మైదానంలో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపాడు. తొలిసారి భారత్‌లో జరుగుతోన్న ఎల్‌ఎల్‌సీ టోర్నమెంట్‌కు ప్రేక్షకాదరణ విపరీతంగా వస్తోంది. ఇప్పటికే 2 కోట్లకుపైగా ప్రత్యక్షంగా చూసిన వ్యూవర్‌షిప్‌ దాటేసింది. 

‘‘సవాయ్ మాన్‌సింగ్ స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. అందుకే లెజెండ్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను అభిమానులు ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాం. విజేతగా నిలిపే ఫైనల్‌ మ్యాచ్‌కు వేదికగా కావడం గర్వకారణం. ప్రపంచంలోని ఇతర లీగ్‌లకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా సాగుతోంది. దిగ్గజ క్రికెటర్లు తమ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ అభిమానులు అలరిస్తున్నారు. గ్రూప్‌ స్టేజ్‌లోనూ ఎంతో ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లు సాగగా.. ఫైనల్‌లోనూ అదే ఉత్సాహంతో ఆడటం ఖాయం’’ అని రహేజా వెల్లడించారు. క్వాలిఫయర్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లకు జోధ్‌పుర్‌ వేదికగా నిలిచింది. అక్టోబరు 2న క్వాలిఫయిర్‌.. అక్టోబర్‌ 3న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని