Legends League Cricket: వ్యూవర్‌షిప్‌లో దూసుకుపోతున్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో  మహామహులు పోటీపడుతున్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌కు విశేష ఆదరణ అభిస్తోంది........

Published : 24 Sep 2022 02:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సహా దేశ విదేశాలకు చెందిన ఎందరో  మహామహులు పోటీపడుతున్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. భారత్‌లో జరుగుతున్న ఈ రెండో ఎడిషన్‌ వ్యూవర్‌షిప్‌లో దూసుకుపోతోంది. దేశంలోని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో 1.6 కోట్ల మందికిపైగా పైగా ప్రత్యక్షంగా వీక్షించారు.  ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల దాటినట్లు టీవీ రేటింగ్‌లను తెలిపే బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొంటుండటంతో దీనికి ఇంతటి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియా మహారాజాస్ పేరుతో ఈ లీగ్‌లో భారత జట్టు పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ టీమ్‌కి, వరల్డ్ జెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సీజన్ ప్రారంభ మ్యాచ్‌కి అత్యధిక వ్యూవర్‌షిప్‌ నమోదైనట్లు బార్క్‌ తెలిపింది. భారత టీ20 లీగ్‌ మినహా  దేశంలో జరిగే ఇతర క్రికెట్ లీగ్‌ల కంటే ఎక్కువ రేటింగ్‌లను సంపాదించడం విశేషం. ఈ సందర్భంగా లెజెండ్స్‌ లీగ్‌ సహవ్యవస్థాపకుడు, సీఈఓ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రీడలను ప్రపంచానికి దగ్గర చేసిన స్టార్‌ స్పోర్ట్స్‌కి, ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. లెజెండ్స్ లీగ్‌ క్రికెట్ ఫైనల్‌ మ్యాచ్‌ వేదికను నిర్వాహకులు ఖరారు చేశారు. అక్టోబర్‌ 5న కటక్‌లోని బారాబతి స్టేడియంలో తుది పోరు జరగనుంది.

ఈ లీగ్‌లో భారత్‌ నుంచి వెటరన్‌ క్రికెటర్లు సచిన్‌తోపాటు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, కైఫ్‌, గౌతమ్‌ గంభీర్‌, యూసఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, శ్రీశాంత్‌ సహా పలువురు పాల్గొంటున్నారు. క్రిస్‌ గేల్‌, జాక్వెస్‌ కల్లిస్‌, షేన్‌ వాట్సన్‌, బ్రెట్‌ లీ, మిచెల్‌ జాన్సన్‌, దిల్షాన్‌, ముత్తయ్య మురళీధరన్‌ సహా అనేక మంది విదేశీ క్రికెటర్లు పాలుపంచుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని