Virat Kohli : అప్పుడు సచిన్‌ వందో ‘శతకం’.. ఇప్పుడు కోహ్లీ సెంచరీ.. హాట్‌ టాపిక్‌ ఇదే!

పరుగుల రారాజు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టుల్లో చివరి ...

Updated : 10 Aug 2022 10:46 IST

ఆశిస్తోన్న క్రికెట్ అభిమానులు

ఇంటర్నెట్ డెస్క్‌: పరుగుల రారాజు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ టెస్టుల్లో చివరి శతకం బాది ఎన్నాళ్లైందో తెలుసా..? దాదాపు 838 రోజులు.. 71 ఇన్నింగ్స్‌ల క్రితం..? గతంలో ప్రతి ఏడు ఇన్నింగ్స్‌లకు సరాసరి ఒక సెంచరీ చేసేవాడు. అయితే రెండున్నరేళ్ల నుంచి మాత్రం ఒక్క శతకం కూడా కొట్టలేదు. లంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ విరాట్‌కు వందో టెస్టు. ఆ మ్యాచ్‌లోనైనా శతకం చేస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాలేదు. ఇక మార్చి 12 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులోనైనా శతకం చేయాలని కోహ్లీ అభిమానులు ఆశిస్తున్నారు. 

ఒకప్పుడు సచిన్‌ అన్ని ఫార్మాట్లు కలిపి వంద శతకాలు చేయాలని అభిమానులు కోరుకున్నారు. దాదాపు 33 ఇన్నింగ్స్‌లు.. ఏడాది తర్వాత చేసిన సెంచరీతో సచిన్‌ వంద శతకాలను పూర్తి చేసి అభిమానులను ఆనందపరిచాడు. ఆ సందర్భంగా సచిన్‌ మాట్లాడుతూ ‘‘ప్రజలు నేను 99 సెంచరీలు చేశాననే విషయాన్నే మరిచిపోయారు’’ అని వ్యాఖ్యానించాడంటే అతడి ‘శతకం’పై భారీగా అంచనాలు పెట్టుకున్నారో కదా.. మరి ఇప్పుడు కోహ్లీ 71వ సెంచరీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వంద టెస్టుల మైలురాయిని దాటాడు. ఇక వచ్చే మ్యాచ్‌లోనైనా కోహ్లీ చెలరేగుతాడని ఆశిద్దాం..

కనీసం 43 కొడితేనే 50 నిలుస్తుంది.. 

ప్రస్తుతం 100 టెస్టుల్లో 50.36  సగటుతో విరాట్ కోహ్లీ 8007 పరుగులు చేశాడు. ఒకప్పుడు 55కిపైగా సగటుతో రాణించిన కోహ్లీ.. గత 49 టెస్టుల్లో దారుణమైన ప్రదర్శన చేశాడు. దాదాపు 30 సగటుతో మాత్రమే పరుగులు రాబట్టాడు. దీంతో తొలిసారి సగటు 50కి దిగజారే ప్రమాదం ఉంది. అయితే, లంకతో రెండో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 43 పరుగులు చేస్తే మాత్రం ఆ గండం నుంచి గట్టెక్కవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని