Lionel Messi: మెస్సీకి కరోనా

ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు  లియోనెల్ మెస్సీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్యారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్‌జీ) క్లబ్‌ ధ్రువీకరించింది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా

Published : 02 Jan 2022 20:21 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు  లియోనెల్ మెస్సీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్యారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్‌జీ) క్లబ్‌ ధ్రువీకరించింది. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా సోకిందని పీఎస్‌జీ వెల్లడించింది. పీఎస్‌జీ క్లబ్‌కు చెందిన డిఫెండర్‌ జువాన్ బెర్నాట్, బ్యాకప్‌ గోల్‌ కీపర్‌ సెర్జియో రికో, మిడ్‌ ఫీల్డర్‌ నాథన్ బితుమజాలా కొవిడ్‌-19 బారినపడినట్లు ప్రకటించింది. వీరితోపాటు సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, వీరంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని పీఎస్‌జీ క్లబ్‌ తెలిపింది.  ఫ్రెంచ్ కప్‌లో భాగంగా సోమవారం రాత్రి ఆయన పీఎస్‌జీ తరఫున క్లబ్ మ్యాచ్ ఆడాల్సింది. ఇప్పటివరకు ఫ్రెంచ్ కప్‌లో మొత్తం 11 లీగ్ మ్యాచ్‌లు ఆడిన మెస్సీ కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే చేశాడు. 

అర్జెంటీనాకు చెందిన మెస్సీ ఇంతకుముందు బార్సిలోనా క్లబ్ తరఫున ఆడాడు. అతడికి ఆ క్లబ్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది.  తన 17 ఏట 2004లో క్లబ్‌లోకి వచ్చిన అతడు మొత్తం 17 సీజన్లు ఆడాడు. బార్సిలోనా తరఫున 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్‌ సాధించాడు. అయితే, క్లబ్‌ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మెస్సీతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించలేమని బార్సిలోనా స్పష్టం చేసింది. దీంతో మెస్సీ ఆ క్లబ్‌కి వీడ్కోలు పలికాడు. అనంతరం పీఎస్‌జీ క్లబ్‌లో చేరాడు. ఫుట్‌బాల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బాలెన్‌ డీ ఓర్‌’ అవార్డును లియోనెల్‌ మెస్సీ ఏడుసార్లు అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని