Lionel Messi: ప్రపంచకప్‌ ట్రోఫీతో మెస్సి పోస్ట్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ చరిత్రలోనే రికార్డు

మూడున్నర దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ అర్జెంటీనా జట్టు ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.  అర్జెంటీనా విజయంలో ఆ జట్టు స్టార్‌ మెస్సిది కీలక పాత్ర. ఫ్రాన్స్‌పై విజయం సాధించిన అనంతరం గెలుపు సంబరాల్లో భాగంగా ట్రోఫీని పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ పోస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ చరిత్రలో అత్యధిక లైక్‌లు పొంది రికార్డు సృష్టించింది.   

Updated : 21 Dec 2022 04:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడున్నర దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ అర్జెంటీనా జట్టు ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఆ జట్టు సూపర్‌స్టార్‌, ప్రస్తుత ఫుట్‌బాల్‌ తరంలో దిగ్గజ ఆటగాడిగా పేరున్న లియొనల్‌ మెస్సి సారథ్యంలో అర్జెంటీనా మళ్లీ ట్రోఫీని ముద్దాడింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో మెస్సి తన జట్టును ముందుండి నడిపించాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో రెండు గోల్స్‌ చేసి కీలక పాత్ర పోషించాడు. క్రీడా ప్రపంచాన్ని ఒక్కసారిగా మునివేళ్లపై నెలబెట్టిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఊహకందని పోరాటపటిమను ప్రదర్శించాయి. పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాళ్ల విజృంభణతో ఆ జట్టు జగజ్జేతగా అవతరించింది. 

(Photo: FIFA Twitter)

ఈ థ్రిల్లింగ్‌ విక్టరీతో ఫుట్‌బాల్‌ విజేతగా నిలిచిన అర్జెంటీనా ప్రయాణంలో మెస్సిది ఎనలేని పాత్ర. 7 గోల్స్‌ చేసి ఈ టోర్నీలో ఉత్తమ ఆటగాడిగా నిలిచిన మెస్సి మైదానంలోనే కాకుండా  సామాజిక మాధ్యమాల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ప్రపంచకప్‌ను గెలిచిన తర్వాత మెస్సి చేస్తున్న పోస్ట్‌లకు సోషల్‌ మీడియాలో కోట్లలో లైక్‌లు వస్తున్నాయి.  ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఎంతో ఉద్వేగానికి లోనైన మెస్సి.. తోటి ఆటగాళ్లతో కలిసి చిందులు వేశాడు. సగర్వంగా ట్రోఫీని ముద్దాడాడు. జట్టు సహచరులు భుజాన ఎత్తుకున్న వేళ రెండు చేతులతో మెస్సి ప్రపంచకప్‌ ట్రోఫీని చూపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను మెస్సి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఆ పోస్ట్‌కు కోట్లలో లైక్‌లు వచ్చాయి. అంతకు ముందు 5,74,40,374 లైక్‌లతో ఒక ‘గుడ్డు’ పోస్ట్‌ ఇన్‌స్టాలో అగ్రస్థానంలో ఉండేది. అయితే మెస్సి పోస్ట్‌ ప్రస్తుతం 6,63,75,220 లైక్‌లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. దీంతో మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌లో స్పందించారు. మెస్సి పోస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ చరిత్రలో అత్యధికంగా లైక్‌ చేసిన పోస్ట్‌ అని పేర్కొన్నారు. అంతేకాకుండా అర్జెంటీనా-ఫ్రాన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సమయంలో రికార్డు స్థాయిలో వాట్సప్‌లో యూజర్లు సెకన్‌కు 25 మిలియన్ల మెసెజ్‌లు చేసినట్లు తెలిపారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సిని అనుకరించేవారి సంఖ్య 40 కోట్లను దాటింది.  

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు