Lionel Messi: ప్రపంచకప్‌లో ‘మిస్టర్‌ 10’ మ్యాజిక్‌.. రికార్డుల వరద..!

మెస్సీ (Lionel Messi) మాయాజాలంతో ఖతార్‌ మురిసిపోతోంది. అర్జెంటీనా(Argentina ) జెర్సీ నం: 10 దూకుడుతో ప్రపంచకప్‌ రికార్డులు దాసోహమంటున్నాయి.

Updated : 14 Dec 2022 11:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అర్జెంటీనా(Argentina) ఫుట్‌బాల్‌ మాంత్రికుడు మెస్సీ (Lionel Messi) 2022 ప్రపంచకప్‌ టోర్నీ(FIFA World Cup)లో ఎవరికీ సాధ్యం కాని అద్భుతాలు సృష్టిస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో ఒక గోల్‌ చేయడంతోపాటు.. మరో గోల్‌ చేయడానికి సహకరించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకొన్నాడు. 2022 ప్రపంచకప్‌(FIFA World Cup)లో అర్జెంటీనా(Argentina) ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగుసార్లు ఈ అవార్డును దక్కించుకొన్నాడంటే అతడి ఫామ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రపంచకప్‌(FIFA World Cup) టోర్నీలో నాలుగు సార్లు ఈ అవార్డు దక్కించుకోవడం మెస్సీకి ఇది రెండోసారి. 2014లో కూడా నాలుగు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మొత్తం మీద మెస్సీ ఆడిన ఐదు ప్రపంచకప్‌లలో 10 సార్లు  ఈ అవార్డు దక్కించుకొన్న ఆటగాడిగా తన పేరు లిఖించుకొన్నాడు. ఈ టోర్నీ మొత్తంలో ఇప్పటి వరకు ఐదు గోల్స్‌ చేయగా.. మరో మూడు గోల్స్‌కు సహకరించాడు.

మాకు తెలివైన జట్టు ఉంది: మెస్సీ

క్రొయేషియాతో సెమీఫైనల్‌ అనంతరం మెస్సీ(Lionel Messi) మాట్లాడుతూ.. అర్జెంటీనా(Argentina)కు తెలివైన జట్టు ఉందని వ్యాఖ్యానించాడు. గేమ్‌ను ఎలా అర్థం చేసుకోవాలో తమకు తెలుసని అన్నాడు. ఆటను ఎక్కడ బిగించాలో తమకు అవగాహన ఉందని పేర్కొన్నాడు. ప్రతిమ్యాచ్‌కు సంబంధించి క్షుణ్ణంగా విశ్లేషించుకొంటామని పేర్కొన్నాడు. అటువంటప్పుడు కొన్ని సందర్భాల్లో లోపాలు కూడా బయటపడతాయని వెల్లడించాడు. ‘‘నేను ప్రపంచకప్‌(FIFA World Cup)ను ఎంజాయ్‌ చేస్తున్నాను. చాలా బాగుంది. ప్రతి మ్యాచ్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన శక్తి ఉంది. గత మ్యాచ్‌తో పోలిస్తే.. ఈ సారి మరింత శ్రమించి విజయం సాధించాం’’ అని మెస్సీ పేర్కొన్నాడు.

క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్‌తో.. అర్జెంటీనా(Argentina) తరపున అత్యధిక ప్రపంచకప్‌ (FIFA World Cup)గోల్స్‌(11) చేసిన ఆటగాడిగా మెస్సీ పేరు నమోదు చేసుకొన్నాడు. గతంలో గాబ్రియేల్‌ బటిస్టుటా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.

ప్రపంచకప్‌(FIFA World Cup)లో ఐదు గోల్స్‌ చేసిన అత్యధిక వయసున్న ఆటగాడిగా మెస్సీ(Lionel Messi) నిలిచాడు.

నాలుగు ప్రపంచకప్‌లలో గోల్స్‌ చేయడంతోపాటు.. గోల్స్‌కు సహకరించిన ఏకైక ఆటగాడు మెస్సీ(Lionel Messi). 

ప్రపంచకప్‌ల(FIFA World Cup)లో అత్యధికంగా గోల్స్‌చేసినా + గోల్స్‌కు సహకరించిన రికార్డును సమం చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. గతంలో బ్రెజిల్‌కు చెందిన రొనాల్డో (19), జర్మనీకి చెందిన మిరోస్లోవ్‌ క్లోసె (19) పేరిట ఈ రికార్డు ఉంది. తాజాగా మెస్సీ (Lionel Messi)(19) దీనిని అందుకొన్నాడు.

టీనేజ్‌లో, 20వ పడిలో, 30వ పడిలో ప్రపంచకప్‌ (FIFA World Cup)గోల్స్‌ సాధించిన ఏకైక ఆటగాడు కూడా ఇతనే. 

ప్రపంచకప్‌(FIFA World Cup)లోని మూడు నాకౌట్‌ దశల్లో గోల్స్‌ చేసిన ఏకైక అర్జెంటీనా(Argentina) ఆటగాడు. 

ప్రపంచకప్‌(FIFA World Cup)లో 25 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. గతంలో జర్మన్‌ ఫుట్‌బాలర్‌ లోథర్‌ మాథ్యూస్‌ కూడా ఈ రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగే ఈ ఫైనల్‌తో ఈ రికార్డును మెస్సీ(Lionel Messi) బద్దలు కొట్టేయనున్నాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని